Spelling Bee Finals: 11 మందిలో 9మంది భారత సంతతే!
Spelling Bee Finals: 11 మందిలో 9మంది భారత సంతతే!

వాషింగ్టన్‌: భారతీయులు.. భారత సంతతికి చెందిన వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో.. పోటీల్లో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా అమెరికా నేషనల్‌ స్పెల్లింగ్‌ బీ పోటీలోనూ భారత సంతతి చిన్నారులు సత్తా చాటారు. స్పెల్లింగ్‌ బీ 2021 పోటీల్లో 209 మంది చిన్నారులు పాల్గొనగా.. చివరకు 11 మంది ఫైనల్‌కు చేరుకున్నారు. వారిలో తొమ్మిది మంది భారత సంతతికి చెందిన చిన్నారులే ఉండటం విశేషం. వారంతా జులై 8న జరగనున్న ఫైనల్‌లో టైటిల్‌ కోసం పోటీ పడబోతున్నారు. ఫ్లోరిడాలోని ఓర్లాండ్‌లో ఉన్న వాల్ట్‌ డిస్నీ వరల్డ్‌ రిసార్ట్‌లో ఈ ఫైనల్‌ పోటీ జరగనుంది. 

స్పెల్లింగ్‌ బీ -2021 ఫైనల్‌కు చేరిన చిన్నారులు వీరే..

రాయ్‌ సెలిగ్మన్‌(12) - ది బహమాస్‌, భావన మదిని(13) - న్యూయార్క్‌, శ్రీతన్‌ గాజుల(14) - నార్త్‌ కరోలినా, ఆశ్రిత గాంధారి(14) - వర్జినియా, అవనీ జోషి(13) - ఇల్లినియస్‌, జైలా అవంత్‌ గార్డే (14) - న్యూ ఓర్లియన్స్‌, వివిన్షా వెదురు(10) - టెక్సాస్‌, ధ్రువ్‌ భారతీయ(12) - డల్లాస్‌, విహాన్‌ సిబల్‌(12) - టెక్సాస్‌, అక్షయినీ కమ్మ(13) - టెక్సాస్‌, ఛైత్ర తుమ్మల(12) - శాన్‌ఫ్రాన్సిస్కో

ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి స్క్రిప్స్‌ నేషనల్‌ స్పెల్లింగ్ సంస్థ 50వేల డాలర్లు నగదు బహుమతి, మెడల్‌, ఛాంపియన్‌షిప్‌ ట్రోఫీ ఇవ్వనుంది. మెరియమ్‌-వెబ్‌స్టర్‌ డిక్షనరీ వారు 2,500 డాలర్లు.. కొన్ని పుస్తకాలు ఇస్తారు. అలాగే, బ్రిటానికా సంస్థ 400 డాలర్లు విలువ చేసే పుస్తకాలు, మూడేళ్లపాటు బ్రిటానికా ఆన్‌లైన్‌ ప్రిమియమ్‌ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ ఇవ్వనుంది. 

గత 20ఏళ్లుగా నిర్వహిస్తోన్న ఈ స్పెల్లింగ్‌ బీ పోటీల్లో అమెరికన్లతో పోటీ పడుతూ భారత సంతతి చిన్నారులు సత్తా చాటుతున్నారు. 2020లో స్పెల్లింగ్‌ బీ పోటీలు కరోనా కారణంగా రద్దయ్యాయి. అంతకుముందు 2019లో 8 మంది కో ఛాంపియన్లుగా నిలవగా.. వారిలో ఏడుగురు భారత సంతతి చిన్నారులే ఉండడం గమనార్హం. 1999 నుంచి జరుగుతున్న ఈ పోటీల్లో మొత్తం 26 మంది ఇండో-అమెరికన్‌ చిన్నారులు ఛాంపియన్లుగా నిలిచారు.

 

Advertisement

Advertisement


మరిన్ని