వలసదారులకు ఊరట! 
వలసదారులకు ఊరట! 

ఎనిమిదేళ్లలో చట్టబద్ధ హోదా వచ్చేందుకు వీలు 
బిల్లు ప్రతిపాదించనున్న బైడెన్‌ 

వాషింగ్టన్‌: అధికార బాధ్యతలు చేపట్టిన తొలిరోజే వలసదారులకు పెద్ద ఊరట కల్పించేలా ఒక బిల్లును అమెరికా నూతనాధ్యక్షుడు జో బైడెన్‌ ప్రతిపాదించనున్నారు. చట్టబద్ధమైన హోదా లేకుండా అమెరికాలో ఉంటున్న దాదాపు 1.10 కోట్ల మందికి ఊరట కలిగించేలా ఈ బిల్లు ఉంటుందని సమాచారం. దీని ప్రకారం ఎనిమిదేళ్లలో వీరంతా చట్టబద్ధ హోదా పొందడానికి వీలుంటుంది. డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో వలసదారులపై కఠిన విధానాలను అనుసరించిన విషయం తెలిసిందే. దీనికి పూర్తి భిన్నమైన రీతిలో బైడెన్‌ వ్యవహరించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగానూ ఆయన దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చారు. దీని ప్రకారం ఈ నెల ఒకటో తేదీ నాటికి అమెరికాలో తగిన చట్టబద్ధ హోదా లేకుండా జీవిస్తున్నవారికి ఐదేళ్ల తాత్కాలిక చట్టబద్ధత కల్పిస్తారు. తనిఖీలు పూర్తి చేసుకుని, పన్నులు చెల్లించడంతో పాటు ఇతరత్రా అవసరమైనవి వీరు సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పౌరసత్వాన్ని సాధించడానికి మూడేళ్ల గడువు ఉంటుంది. ఇప్పటికే వివిధ పనులు చేస్తున్న కొంతమంది వలసదారులకు త్వరగానే ప్రక్రియ పూర్తయిపోతుంది. పిల్లలుగా అమెరికాకు వచ్చినవారు, వ్యవసాయ కార్మికులు, తాత్కాలిక రక్షణ హోదాతో వచ్చినవారు గ్రీన్‌కార్డు అర్హతను త్వరగా పొందడానికి వీలుంటుంది. ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న దేశాల నుంచి అమెరికాకు వలసలు రావడాన్ని అడ్డుకునేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని బైడెన్‌ రద్దు చేసే అవకాశాలున్నాయి.

ఇవీ చదవండి...
ట్రంపరి స్వయంకృతం!

బంధం ముడేసే బైడెన్‌ బృందం

Advertisement

Advertisement


మరిన్ని