TANA: తానా సంయుక్త కార్యదర్శిగా తాళ్లూరి
TANA: తానా సంయుక్త కార్యదర్శిగా తాళ్లూరి

టెక్సాస్‌: ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం(తానా) సంయుక్త కార్యదర్శిగా ముర‌ళి తాళ్లూరి ఎన్నిక‌య్యారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో 11,277 ఓట్లు సాధించి విజ‌యం ద‌క్కించుకున్నారు. తెలంగాణకు చెందిన తాళ్లూరి.. తానా ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకోవ‌డం ప‌ట్ల రాష్ట్ర ప్ర‌జ‌లు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఖ‌మ్మం జిల్లాకు చెందిన ఆయన పాఠశాల విద్యనంతా కారేపల్లిలోనే పూర్తి చేశారు.  ఖమ్మంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత హైదరాబాద్ లో ఎంసీఏ చదువుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్లారు. అక్కడ టెక్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ సంస్థను స్థాపించి, పలువురు భారతీయ తెలుగు విద్యార్థులకు ఉపాధిని క‌ల్పించారు. 

గ‌డిచిన 20 సంవత్సరాలుగా అమెరికాలోని ఆస్టిన్ టెక్సస్ నగరంలో స్థిరపడ్డారు. తానాలో 2013 నుంచి 2020 వరకు వివిధ హోదాల్లో పనిచేసి మంచి గుర్తింపు పొందారు. గ‌త ఏడాది క‌రోనా స‌మ‌యంలో తెలుగు రాష్ట్రాల్లోని పేద‌ల‌కు, వ‌ల‌స కార్మికుల‌కు, అమెరికాలోని తెలుగు వారికి కూడా ఆయన సేవ‌లు అందించారు. త‌ద్వారా తానాలో త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు పొందారు. తాజాగా తానా ఎన్నిక‌ల్లో సంయుక్త కార్యదర్శిగా పోటీ చేశారు.  ప్రత్యర్థిపై 11,277 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడుతూ త‌న‌పై ఉన్న విశ్వాసంతో గెలిపించిన ప్ర‌తి ఒక్క‌రికీ ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌న‌కు అప్ప‌గించిన బాధ్యలను నిబ‌ద్ధ‌త‌తో పూర్తి చేస్తాన‌ని, తానా అభివృద్ధికి శాయశ‌క్తులా కృషి చేస్తాన‌ని అన్నారు. ముర‌ళి తాళ్లూరి విజ‌యం ప‌ట్ల ఆయ‌న స‌హాధ్యాయులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


మరిన్ని