Floods: న్యూయార్క్‌లో ఇడా విలయం.. 46కు చేరిన మృతులు
Floods: న్యూయార్క్‌లో ఇడా విలయం.. 46కు చేరిన మృతులు

న్యూయార్క్‌: ఇడా హరికేన్‌ ధాటికి ఈశాన్య అమెరికా విలవిల్లాడుతోంది. హరికేన్‌ ప్రభావంతో న్యూయార్క్‌, న్యూజెర్సీతో పాటు పలు ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. వర్షాల సంబంధిత ఘటనల్లో కనీసం 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క న్యూజెర్సీలోనే 23 మంది మృత్యువాత పడగా.. న్యూయార్క్‌ నగరంలో కనీసం 13 మంది చనిపోయినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. మరో 40 మందికి పైగా గల్లంతైనట్లు తెలుస్తోంది.

స్థానిక కాలమానం ప్రకారం న్యూయార్క్‌, న్యూజెర్సీల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు రికార్డు స్థాయిలో కుంభవృష్టి కురిసింది. దీంతో ఒక్కసారిగా వరదలు సంభవించాయి. ఫలితంగా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఇళ్లల్లోకి మోకాలిలోతు నీరు చేరింది. వీధులన్నీ నదులను తలపించాయి. మెట్రో స్టేషన్లు, సబ్‌వేలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. వర్షాలతో రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. రైల్వే ట్రాక్‌లపైకి నీరు చేరడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. విమానాలు రద్దయ్యాయి. 

గత యాభై ఏళ్లలో ఈ స్థాయిలో వరదలు చూడలేదని స్థానికులు చెబుతున్నారు.  న్యూయార్క్‌లోని జాతీయ వాతావరణ సేవల కేంద్రం వరద ఉద్ధృతి దృష్ట్యా మొట్టమొదటిసారిగా అత్యవసర హెచ్చరికలను జారీ చేసింది. పెన్సిల్వేనియాలోని జాన్స్‌టౌన్‌లో ఓ జలాశయంలోకి ప్రమాదకరస్థాయిలో నీరు చేరడంతో స్థానికులను ఖాళీ చేయించారు. న్యూజెర్సీ, పెన్సిల్వేనియాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడంతో లక్షల మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ల్యారీ తుపాను అంతకంతకూ బలపడుతోందని, శనివారం కల్లా అది ఇడా స్థాయిలో తీవ్రరూపు దాల్చే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు.

ఇడా బీభత్సం.. మరిన్ని చిత్రాలు



మరిన్ని