కమలా హారిస్‌ అసలు పేరేంటి?
కమలా హారిస్‌ అసలు పేరేంటి?

ఆసక్తికర విషయాలతో కొత్త పుస్తకం

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు సంబంధించి తెలియని విషయాలతో కొత్త పుస్తకం ఈ నెలాఖరులో విడుదల కానుంది. ఇండియన్‌-అమెరికన్, టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా అమెరికా బ్యూరో చీఫ్‌ అయిన చిదానంద్‌ రాజ్‌ఘట్ట ‘కమలా హారిస్‌: ఫినామినల్‌ వుమెన్‌’ (కమలా హారిస్‌: అద్భుత మహిళ) పేరుతో దీన్ని రాశారు. కమలా హారిస్‌ జన్మ ధ్రువపత్రంలో ఆమె పేరును ఏమని రాశారు?...అన్న దగ్గర నుంచి అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎదిగే వరకు చోటుచేసుకున్న పరిణామాలను వివరించారు. బర్త్‌ సర్టిఫికెట్‌లో ఆమె పేరును కమలా అయ్యర్‌ అని రాశారు. అనంతరం కమలా దేవి అని మార్చారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌ సంప్రదాయ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. తండ్రి డొనాల్డ్‌ హారిస్‌ ఆఫ్రికన్‌-అమెరికన్‌. ఆర్థిక శాస్త్రం చదివిన ఆయన కమల చంటిపాపగా ఉన్నప్పుడు భారత్‌ వచ్చి దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో కొంతకాలం పాటు అధ్యయనం చేశారు. ఆ విధంగా ఆయనకు భారత్‌తో బంధం ఏర్పడింది. ఆమె చిన్నతనంలో ప్రముఖ ఆర్థికశాస్త్రవేత్తలు అమర్త్య సేన్, లార్డ్‌ మేఘానంద దేశాయ్, అజిత్‌ సింగ్‌లు వారి ఇంటికి వచ్చేవారు. వీరంతా మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సహచరులు కావడం విశేషం. కమలా హారిస్‌ వంటలో ప్రవీణురాలు కూడా. ఆమె వంటను కేవలం పాకశాస్త్ర కళగానే కాకుండా ఓ చికిత్స విధానంగా కూడా పరిగణిస్తారు. భారతీయ వంటకాలను చాలా మందికి రుచి చూపించారు కూడా. 

Advertisement

Advertisement

Tags :

మరిన్ని