రచయిత్రి మంగిపూడి రాధికకు ‘ప్రవాస తెలుగు పురస్కారం’
రచయిత్రి మంగిపూడి రాధికకు ‘ప్రవాస తెలుగు పురస్కారం’

సింగపూర్‌: ప్రముఖ రచయిత్రి, వ్యాఖ్యాత, సంఘసేవకురాలు రాధిక మంగిపూడి ‘తెలుగు భాషా దినోత్సవ’ సందర్భంగా అంతర్జాతీయ ‘ప్రవాస తెలుగు పురస్కారం-2021’ అందుకున్నారు. విదేశాలలో నివసిస్తూ తెలుగు భాష, సాహిత్యం సంస్కృతుల వికాసం కోసం పాటుపడిన 12 మంది తెలుగు వారిని ఎంపిక చేసి ‘ప్రవాస తెలుగు పురస్కారాలు-2021’ అందజేశారు. ‘సౌత్ ఆఫ్రికన్ తెలుగు కమ్యూనిటీ’, ‘వీధి అరుగు’ సంస్థల సంయుక్త ఆధ్వర్యములో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలలోని 75 తెలుగు సంఘాల భాగస్వామ్యముతో అంతర్జాల వేదికగా ఈ కార్యక్రమం జరిగింది.

ప్రముఖ నటులు, రచయిత తనికెళ్ళ భరణి ఈ పురస్కారాన్ని అందుకున్న అభ్యర్థుల పేర్లను ప్రకటించి అభినందనలు తెలియజేశారు. ప్రముఖ సినీ రచయిత భువనచంద్ర, వంశీ ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపకులు వంశీ రామరాజు, డాక్టర్ మీగడ రామలింగస్వామి తదితర గౌరవ అతిథుల సమక్షంలో నిర్వాహకులు ఈ పురస్కారాలను అందుకున్న మొత్తం 12 మంది ప్రవాస భాషా సేవకుల కృషిని గూర్చి ప్రశంసిస్తూ వారిని గురించిన మరిన్ని వివరాలను ప్రకటించారు. రాధికకు సభలోని పెద్దలందరూ ప్రత్యేక ఆశీస్సులు, అభినందనలు తెలియజేశారు.

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ముఖ్య అతిథిగా ప్రారంభోపన్యాసం చేసి ఈ సభను ప్రారంభించగా, రాధిక మంగిపూడి వ్యాఖ్యాన నిర్వహణ గావిస్తూ కార్యక్రమాన్ని ఆసక్తికరంగా నడిపించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు విక్రమ్ పెట్లూరు (దక్షిణాఫ్రికా), డాక్టర్ వెంకట్ తరిగోపుల (నార్వే), సుధాకర్ (కువైట్), లక్ష్మణ్ (దక్షిణాఫ్రికా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), పీసపాటి జయ (హాంకాంగ్) తదితరులు పాల్గొన్నారు.

‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ వ్యవస్థాపక అధ్యక్షులు కవుటూరి రత్న కుమార్ మాట్లాడుతూ.. తమ సంస్థ కార్యనిర్వాహక సభ్యురాలైన రాధికకు ఈ పురస్కారం లభించడం తమ సంస్థకు గర్వకారణమన్నారు. ఆమెలోని ప్రతిభకు తగిన గుర్తింపు ఈ విధంగా లభించిందని, తమ సంస్థ సభ్యులందరి తరఫున ఆమెకు అభినందనలు తెలియజేస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

అన్ని దేశాల తెలుగు సంస్థల ప్రతినిధులు, సింగపూర్ ‘శ్రీ సాంస్కృతిక కళాసారథి’ సభ్యులు, తెలుగు సినీ దిగ్గజాలు, సాహితీ ప్రముఖులు, విజయనగర జిల్లా అధికారులు, గోల్డ్ హెరిటేజ్ ఆఫ్ విజయనగరం సభ్యులు, బంధుమిత్రులు అందరి అభినందనలు వెల్లువెత్తుతున్నాయని హర్షం వ్యక్తం చేసి, వారందరికీ కార్యక్రమ నిర్వాహకులకు రాధిక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Tags :

మరిన్ని