కువైట్‌లో వరలక్ష్మి వ్రత వేడుకలు
కువైట్‌లో వరలక్ష్మి వ్రత వేడుకలు

కువైట్‌: తెలుగు కళా సమితి కువైట్ ఆధ్వర్యంలో అంతర్జాలం వేదికగా (జూమ్) ద్వారా వరలక్ష్మి వ్రత వేడుకలు జరిగాయి. కువైట్‌లోని వివిధ ప్రాంతాల్లోని ఆడపడుచులందరూ శుక్రవారం (ఆగస్టు 20న) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏటా వరలక్ష్మి వ్రతం, దేవీ నవరాత్రులు వంటివి అందరూ కలిసి సందడిగా చేసుకునేవారు. కరోనా మహమ్మారి వల్ల ఈ ఏడాది సామూహిక కార్యక్రమాలు, పండగలు, పూజలు ఆగిపోవడంతో సభ్యులు ఒకింత నిరుత్సాహనికి గురయ్యారు. ఈ నేపథ్యంలో జూమ్‌ వేదికగా వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించి కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు సమితి సభ్యులు.

ఉదయం 8.45 గంటలకు పంచసూక్తం, భక్తి పాటలతో కార్యక్రమం ప్రారంభమైంది. 9.20 గంటలకు తెలుగు కళా సమితి అధ్యక్షులు సాయి వెంకట సుబ్బారావు ప్రసంగించారు. కార్యక్రమంలో పాల్గొంటున్న సభ్యులకు, పురోహితులు శర్మకు స్వాగతం పలికి పూజా కార్యక్రమాల బాధ్యతలను వారికి అప్పగించారు. వరలక్ష్మి పూజా విధానం, వాటికి కావలసిన సామగ్రి, పూజ విశిష్టతను పురోహితులు శర్మ అందరికీ వివరించారు. సర్వమంగళ సంప్రాప్తి, సకలాభీష్టాలు నెరవేరాలని, నిత్య సుమంగళిగా వర్ధిల్లాలని ప్రార్థిస్తూ స్త్రీలు తమ ఇళ్లలో వరలక్ష్మి దేవిని కన్నులపండువగా అలంకరించారు. పంచభక్ష పరమాన్నాలను నైవేద్యంగా సమర్పించారు. వ్రతం ముగిసిన తర్వాత తెలుగు కళా సమితి కార్యవర్గ సభ్యురాలు సుధా దాసరి మహిళలను లలిత, విష్ణు సహస్రనామ పారాయణానికి ఆహ్వానించారు. ఇందులో 80 మందికి పైగా ఆడపడుచులు పాల్గొన్నారు. వరలక్ష్మి దేవికి మంగళ హారతులిచ్చి దేవి అనుగ్రహాన్ని పొందారు. ఈ కార్యక్రమం జయప్రదం కావడానికి సహకరించిన సభ్యులందరికీ, తమ కార్యవర్గానికి తెలుగు కళా సమితి అధ్యక్షులు సాయి వెంకట సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి శ్రీవత్స, వర్ధని కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

మరిన్ని