భారత యువత భవిష్యత్తు భద్రం
భారత యువత భవిష్యత్తు భద్రం

విద్య, ఉపాధి రంగాల్లో శరవేగంగా అభివృద్ధి
ఆ విషయంలో దేశానికి రెండో స్థానం
 ‘2020 ప్రపంచ యువజన అభివృద్ధి సూచీ’ వెల్లడి

లండన్‌: భారత్‌లో యువత కీలకమైన విద్య, ఉపాధి రంగాల్లో శరవేగంగా పురోగతి సాధిస్తున్నారు. తద్వారా దేశ బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. లండన్‌లోని కామన్‌వెల్త్‌ సచివాలయం మంగళవారం విడుదల చేసిన ‘2020 ప్రపంచ యువజన అభివృద్ధి సూచీ’తో ఈ విషయం ప్రస్ఫుటమైంది. దీని ప్రకారం 2010-2018 మధ్య యువజన అభివృద్ధి అత్యంత వేగంగా జరిగిన ఐదు దేశాల్లో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. తొలి స్థానంలో అఫ్గానిస్థాన్, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో రష్యా, ఇథియోపియా, బుర్కినా ఫసో నిలిచాయి. ఈ దేశాలు యువజన అభివృద్ధిలో సగటున 15.74 శాతం పురోగతి సాధించాయి. కానీ మొత్తం మీద చూస్తే భారత్‌ బాగా వెనుకబడి ఉంది. 181 దేశాల్లో యువత స్థితిగతులను అధ్యయనం చేసి రూపొందించిన ఈ జాబితాలో భారత్‌ 122వ స్థానంలో నిలిచింది. మూడేళ్లకోసారి విడుదల చేసే ఈ జాబితాలో ఈసారి సింగపూర్‌ ప్రథమ స్థానాన్ని దక్కించుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో స్లొవేనియా, నార్వే, మాల్టా, డెన్మార్క్‌ ఉన్నాయి. వెనుకబడ్డ దేశాలైన చాద్, సెంట్రల్‌ ఆఫ్రికన్‌ రిపబ్లిక్, దక్షిణ సూడాన్, అఫ్గానిస్థాన్, నైగర్‌ చివరి ఐదు స్థానాల్లో నిలిచాయి. విద్య, ఉపాధితో పాటు ఆరోగ్యం, సమానత్వం, సమ్మిళితం, శాంతి, భద్రత, రాజకీయ, పౌర వ్యవహారాల్లో 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువత భాగస్వామ్యానికి సంబంధించి 27 అంశాలను పరిగణనలోకి తీసుకుని దేశాలకు ర్యాంకులను కేటాయిస్తారు. ఈ సూచీ ప్రకారం..

2010-2018 మధ్య ప్రపంచవ్యాప్తంగా యువత స్థితిగతులు 3.1 శాతం మేర మెరుగయ్యాయి.
2010 నుంచి శాంతి స్థాపన, విద్య, ఉపాధి, సమ్మిళితం, ఆరోగ్య రంగాల్లో యువత భాగస్వామ్యం పెరిగింది.
యువత మరణాల రేటు 1.6 శాతం తగ్గింది. హెచ్‌ఐవీ వ్యాప్తి, స్వీయ హాని, ఆల్కహాల్, టొబాకో వినియోగంలో 2 శాతం తగ్గుదల నమోదైంది. తద్వారా యువత ఆరోగ్యంలో 4.39 శాతం అభివృద్ధి సాధ్యమైంది.
స్త్రీ, పురుష వివక్ష తగ్గినా, అక్షరాస్యత పెరిగినా, మహిళల భద్రత మెరుగుపడలేదు.

Tags :

మరిన్ని