చారిత్రాత్మకం జ్యోతిర్లింగం శివపదం లాస్యం
చారిత్రాత్మకం జ్యోతిర్లింగం శివపదం లాస్యం

ప్రముఖ ప్రవచన కర్త, ఆధ్యాత్మిక గురువు సామవేదం షణ్ముఖశర్మ తెలుగు, సంస్కృత భాషలలో 1100 పైగా శివపదం కీర్తనలు రచించిన విషయం అందరికీ తెలిసిందే. అందులో ద్వాదశ జ్యోతిర్లింగ సాహిత్యం కూడా ఒకటి. శివపద సంగీత, నాట్య ప్రదర్శనలు దేశ విదేశాలలో ఎన్నో జరిగాయి. తాజాగా గురు పౌర్ణమిని పురస్కరించుకుని ద్వాదశ జ్యోతిర్లింగాల విశిష్టత అందరికీ తెలిసేలా ఏడు వైవిధ్య శాస్త్రీయ నృత్య రీతుల ప్రదర్శన జరిగింది. అమెరికా, రష్యాలలోని 11 నృత్య శిక్షణాలయాల నుంచి 58 మంది గురు-శిష్యుల బృందం, నయనా నందకరంగా ఆంధ్ర నాట్యం, కూచిపూడి, భరతనాట్యం, మోహినియాట్టం, మణిపురి, ఒడిస్సి , కథక్ నృత్య రీతులను సమ్మోహనకరంగా ప్రదర్శించారు.

రుషి పీఠం యూట్యూబ్ మాధ్యమంగా జరిగిన నృత్య ప్రదర్శన విశేషంగా అలరించింది. శివపదాంకిత అంటూ వాణీ గుండ్లపల్లి, రవిగుండ్లపల్లిలను సామవేదం షణ్ముఖశర్మ అభినందించారు. శివపదం బృందం కలిసి  మహత్ నృత్య కార్యక్రమాన్ని మహోన్నతంగా నిర్వహించారు. మొదటి జ్యోతిర్లింగమైన సోమనాథుడి ఆవిర్భావ ఘట్టం నుంచి ద్వాదశ జ్యోతిర్లింగాల కీర్తనలపై అద్భుతమైన నృత్యంతో కనుల ముందు ఆయా దివ్య జ్యోతిర్లింగ క్షేత్రాలని ఆవిష్కరింపచేశారు. ద్వాదశజ్యోతిర్లింగ గాథల కీర్తనలోని పల్లవిని వివిధ నాట్యశైలుల గురువులందరూ కలిసి ప్రదర్శించారు.

కూచిపూడి- రాజేష్ శిష్య బృందం;

భరతనాట్యం- చందన శిష్య బృందం, నైనా శిష్య బృందం;

ఒడిస్సీ- బిధీష శిష్య బృందం, సీమ శిష్య బృందం;

మోహినియట్టం -సరస్వతి శిష్య బృందం;

ఆంధ్ర నాట్యం - హేమ శిష్య బృందం;

మణిపురి - మిత్ర శిష్యబృందం;

కథక్ - ప్రగ్యా, దీపన్విత శిష్య బృందం;

నృత్యసభ ఫౌండేషన్, రష్యా - గురుశిష్య బృందం అద్భుతంగా ప్రదర్శించారు. షణ్ముఖశర్మ సమన్వయ వ్యాఖ్యానంతో సాగిన నృత్యరూపకం వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ద్వాదశ జ్యోతిర్లింగాల శివపద సాహిత్యం, నాట్యప్రదర్శన చూడటం తమ అదృష్టమని, శివపద నృత్య రూపకం ఆద్యంతం ఒక అద్భుతం అమెరికాకు చెందిన రాధికా కామేశ్వరి వంటి వారు ప్రశంసల జల్లు కురిపించారు. 2016లో షణ్ముఖశర్మ రచించిన ద్వాదశ జ్యోతిర్లింగ సాహిత్యాన్ని లాల్‌గుడి, బ్రహ్మానందం, అనురాధ తదితరులు ఎంతో హృద్యంగా స్వరపరిచారు. యూఎస్‌లో పుట్టి పెరిగిన యువత మృదు మధురంగా ఆలపించడం విశేషం.

Tags :

మరిన్ని