తెలుగంటే ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌ అంటే తెలుగు..
తెలుగంటే ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌ అంటే తెలుగు..

టెక్సాస్/హ్యూస్టన్: వంశీ గ్లోబల్ అవార్డ్స్, గాయని శారద ఆకునూరి, సంతోషం ఫిలిం న్యూస్‌, చంద్ర తేజాలయ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో తెలుగువారి అభిమాన నటుడు నందమూరి తారక రామారావు 98వ జయంతి వేడుకలు జరిగాయి. అంతర్జాలం వేదికగా ఆ మహానటుడికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రముఖ సినీ నటులు మురళీమోహన్ మాట్లాడుతూ.. తాను ఎన్టీఆర్‌తో నటించడం తన అదృష్టమన్నారు. తెలుగు వారి గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని నిలబెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ముఖ్యమంత్రిగా పేదలకు ఎన్నో సేవా పథకాలు ప్రవేశ పెట్టారని అలాంటి వ్యక్తికి భారతరత్న రాకపోవడం విచారకరమన్నారు.

మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ.. తెలుగంటే ఎన్టీఆర్‌.. ఎన్టీఆర్‌ అంటే తెలుగు అని అన్నారు. తెలుగు జాతికి, భాషకు ఎన్టీఆర్‌ చేసిన సేవలను గుర్తుచేశారు.  దర్శక-నిర్మాత వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ.. ఎన్టీఆర్‌ వంటి ప్రముఖుల చరిత్ర, ఘనత, ప్రభావం  మీడియా ద్వారా టెక్నికల్‌గా పొందుపరచాలని కోరారు. ఈ సందర్భంగా సినీ గేయ రచయిత భువన చంద్ర, దర్శకులు రేలంగి నరసింహారావు, నటులు రాజేంద్రప్రసాద్, చంద్రమోహన్, రచయిత భారవి తదితరులు ఎన్టీఆర్‌తో తమ అనుబంధాన్ని పంచుకున్నారు. అమెరికా, యూకే, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, హాంకాంగ్‌, న్యూజిలాండ్, ఉగాండా, అబుదాబి, ఓమన్, సింగపూర్, మలేషియా తదితర దేశాల నుంచి తెలుగు ప్రముఖులు వారి సందేశాలను పంపించి ఘన నివాళి అర్పించారు.

గాయకులు చంద్రతేజ, శారద ఆకునూరి ఎన్టీఆర్‌ సుమధుర గీతాలను ఆలపించారు.  వంశీ గ్లోబల్ అవార్డ్స్ వ్యవస్థాపకులు డా.వంశీ రామరాజు ఎన్టీఆర్‌తో అనుబంధాన్ని పంచుకున్నారు. తెన్నేటి సుధాదేవి(అధ్యక్షురాలు-వంశీ), శైలజ సుంకరపల్లి మేనేజింగ్‌ ట్రస్టీ వంశీ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని