అమెరికన్‌ ఆర్మీ సీఐఓగా రాజ్‌ అయ్యర్‌
అమెరికన్‌ ఆర్మీ సీఐఓగా రాజ్‌ అయ్యర్‌

వాషింగ్టన్‌: భారతీయ-అమెరికన్‌ డాక్టర్‌ రాజ్‌ అయ్యర్‌ అమెరికన్‌ ఆర్మీ తొలి ప్రధాన సమాచార అధికారి (సీఐఓ)గా బాధ్యతలు చేపట్టారు. 2020 జులైలో కొత్తగా ఈ పదవిని ఏర్పాటుచేసిన తర్వాత బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగా ఆయన ఘనత సాధించారు. అమెరికా రక్షణ శాఖలో ఉన్నత ర్యాంకు భారతీయ-అమెరికన్‌ సివిల్‌ అధికారుల్లో ఆయన ఒకరు. ఈ పదవిలో ఆయన అమెరికా సైనిక వ్యవహారాల కార్యదర్శికి ఇన్ఫర్మేషన్‌ మేనేజ్‌మెంట్‌/ఐటీ సంబంధిత వ్యవహారాల్లో ముఖ్య సలహాదారు (ప్రిన్సిపల్‌ అడ్వైజర్‌)గా వ్యవహరిస్తారని పెంటగాన్‌ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది త్రీ-స్టార్‌ జనరల్‌ హోదాకు సమానం. అమెరికా సైన్యానికి సంబంధించిన ఐటీ కార్యకలాపాలకు కేటాయించిన 16 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ. 1.17 లక్షల కోట్లు) వార్షిక బడ్జెట్‌ను ఆయన పర్యవేక్షిస్తారు.

తమిళనాడు నుంచి..
తమిళనాడులోని తిరుచురాపల్లికి చెందిన అయ్యర్‌ బెంగుళూరులో పెరిగారు. తిరుచ్చి ఎన్‌ఐటీలో డిగ్రీ చేసిన తర్వాత ఉన్నత చదువులకు అమెరికాకు వెళ్లారు. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ నుంచి పీహెచ్‌డీ చేసిన ఆయన అంతకుముందు అదే విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో ఎంఎస్‌ చేశారు. మిషిగాన్‌ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ కూడా పూర్తిచేశారు. ఆయన సతీమణి బృంద అమెరికా ప్రభుత్వంలో హెల్త్‌కేర్‌ ఐటీ ప్రోగ్రామ్‌ మేనేజర్‌. వారికి ఇద్దరు పిల్లలు.

Advertisement

Advertisement

Tags :

మరిన్ని