నేడు ట్రంప్‌ డిశ్ఛార్జి!
నేడు ట్రంప్‌ డిశ్ఛార్జి!

ఆరోగ్యంగా ఉన్నానన్న అధ్యక్షుడు
ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు: వైద్య వర్గాలు

వాషింగ్టన్‌: కరోనా చికిత్స నిమిత్తం సైనిక ఆసుపత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సోమవారమే డిశ్ఛార్జి అయ్యే అవకాశాలున్నాయి. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గిపోవడంతో ఇటీవలి కాలంలో రెండుసార్లు ఆయనకు ఆక్సిజన్‌ అందించామని శ్వేతసౌధం వైద్యులు ఆదివారం విలేకరులకు తెలిపారు. శుక్రవారం ఒక దశలో ఆక్సిజన్‌ 94% కంటే దిగువకు పడిపోయిందని వివరించారు. ఇప్పుడు పరిస్థితి బాగుందని, జ్వరం ఏమాత్రం లేదని తెలిపారు. రెమిడెసివిర్‌ రెండో మోతాదు ఇచ్చిన తర్వాత కాలేయం, మూత్రపిండాలు వంటి కీలక అవయవాల పనితీరు సాధారణ స్థితికి చేరుకుందని వైద్యులు వెల్లడించారు. ట్రంప్‌ ఒక వీడియో విడుదల చేస్తూ- రాబోయే కొద్దిరోజులు నిజంగా తనకు పరీక్షా కాలమని, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పారు. తాను ఆసుపత్రిలో చేరినప్పటి కంటే ఇప్పుడు బాగున్నానని చెప్పారు. అధికారులు బయటకు చెప్పినదానికంటే ట్రంప్‌ పరిస్థితి శుక్రవారం మాత్రం సంక్లిష్టంగా ఉందని అంతకుముందు శ్వేతసౌధం సిబ్బంది అధిపతి మార్క్‌ మెడోస్‌ చెప్పారు. జ్వరం, ఆక్సిజన్‌ స్థాయిలపై తామెంతో ఆందోళన చెందామని, అనూహ్య రీతిలో ఆయన కోలుకున్నారని చెప్పారు. ‘అమెరికా నుంచే కాదు.. యావత్‌ ప్రపంచం తరఫున వైరస్‌తో పోరాడుతున్నా. దానినుంచి బయటపడతాననే ఆశాభావంతో ఉన్నా. కచ్చితంగా వైరస్‌ను మట్టి కరిపిస్తాం. నేను తీసుకుంటున్న చికిత్సలు.. అద్భుతాలు. అందుకే నేను బాగున్నా’ అని ట్రంప్‌ తాజా వీడియోలో చెప్పారు.
జ్వరం లేదు
అధ్యక్షుడికి ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని, తామంతా అత్యంత అప్రమత్తంగా ఉన్నామని శ్వేతసౌధం ఫిజీషియన్‌ సియాన్‌ కాన్లే చెబుతున్నారు. రెమిడెసివిర్‌ రెండో మోతాదునూ ట్రంప్‌ తీసుకున్నారని ఆయన వెల్లడించారు. ట్రంప్‌కు జ్వరం లేదని, ఆక్సిజన్‌ స్థాయి 96-98 మధ్య ఉంటోందని చెప్పారు. బహిరంగ సమావేశాల్లో పాల్గొనకపోవడమే ఉత్తమమనే సలహాలను పట్టించుకోకుండా ట్రంప్‌ నాలుగు వారాలుగా విస్తృతంగా పర్యటిస్తూ వైరస్‌కు చిక్కారని గట్టిగా వినిపిస్తోంది. ఆగిపోయిన ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్లడంపై ట్రంప్‌ బృందం గట్టి కసరత్తు చేస్తోంది. ఆయన వచ్చేవరకు సమయం వృథా కాకుండా కార్యాచరణ రూపొందించింది. కీలక రాష్ట్రాల్లో ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌, ట్రంప్‌ కుటుంబ సభ్యులు వ్యక్తిగతంగా ప్రచారంలో దిగుతారు. అధ్యక్షుడి అనారోగ్యం చిన్నదైనా, పెద్దదైనా అది ఏళ్ల తరబడి బయటకు రాకపోవడం అగ్రరాజ్యంలో రివాజే. గతంలో వుడ్రో విల్సన్‌, గ్రోవర్‌ క్లీవ్‌లాండ్‌, లిండన్‌ బి జాన్సన్‌, ఫ్రాంక్లిన్‌ రూజ్‌వెల్ట్‌ విషయంలో ఇలాగే గోప్యత పాటించారు.
ఏం జరిగితే జరగనీయండి
శ్వేతసౌధంలో గదికి పరిమితమైతే సరిపోతుందని తనకు వైద్యులు చెప్పినా ప్రజల్ని చూడకుండా, వారితో మాట్లాడకుండా ఉండలేనని ట్రంప్‌ తెలిపారు. ‘గదిలోనే సురక్షితంగా, బందీగా ఉండడం నా వల్ల కాదు. ఏం జరిగితే జరగనీయండి. ఒక నేతగా సమస్యలతో పోరాడాల్సిందే’ అని పేర్కొన్నారు. ప్రథమ మహిళ మెలనియా బాగా కోలుకుంటున్నారని చెప్పారు.  తమ తండ్రి ఎంతో ఆశాభావంతో ఉన్నారని కుమార్తె ఇవాంక, కుమారుడు ఎరిక్‌ చెప్పారు. అధ్యక్షుడికి చేరువగా పనిచేసే భద్రత ఉద్యోగిలో మరొకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Tags :

మరిన్ని