విద్యారంగంలోనూ స్వావలంబన
విద్యారంగంలోనూ స్వావలంబన

అమెరికాలో చదువుపై నీలినీడలు

అమెరికాలో రోజురోజుకు కరోనా విజృంభిస్తుండటంతో విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలోనే డొనాల్డ్‌ ట్రంప్‌ సర్కారు బాంబు లాంటి ఆదేశం పేల్చింది. అమెరికాలో ఉండిపోయిన విదేశీ విద్యార్థులు వ్యక్తిగతంగా తరగతులకు హాజరుకాకుండా ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితమైతే వెంటనే స్వదేశాలకు తిరుగు టపా కట్టాలని ఆ ఉత్తర్వు సారాంశం. దీన్ని అమెరికన్‌ విశ్వవిద్యాలయాలతోపాటు ప్రవాస భారతీయులూ కోర్టులో సవాలు చేయడంతో ట్రంప్‌ సర్కారు తన ఉత్తర్వును ఉపసంహరించుకుంది. ప్రస్తుతానికి గండం గడిచినా ట్రంప్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచే విదేశీ విద్యార్థులు, హెచ్‌ 1బీ తదితర వీసాదారులకు దినదిన గండంలానే ఉంది. ట్రంప్‌ చపలచిత్త విధానాల వల్ల భారత్‌ సహా పలుదేశాల నుంచి అమెరికాకు వచ్చే విద్యార్థులు తగ్గిపోతున్నారు. అమెరికా కన్నా కెనడా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా, జర్మనీలకు వెళ్లి చదువుకోవడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు.

పరుగెత్తి పాలు తాగేకన్నా...

ట్రంప్‌ జమానాలో అమెరికన్లకే అవకాశాలనే నినాదంతో హెచ్‌ 1బీ తదితర వీసాలకు ఆంక్షల అరదండాలు బిగిస్తున్నారు. ఫలితంగా మన విద్యార్థులకు అమెరికా కల కల్లగా మిగిలే ప్రమాదం కనిపిస్తోంది. పోనీ, స్వదేశంలోనే ఉండి చదువుకుందామా అంటే ఇక్కడ ఉన్నత ప్రమాణాలు గల విద్యాసంస్థల్లో ప్రవేశం సంపాదించడం మాటలు కాదు. దిల్లీ విశ్వవిద్యాలయం వంటి ప్రముఖ విద్యాసంస్థల్లో షెడ్యూల్డ్‌ కుల విద్యార్థులకు సైతం కటాఫ్‌ మార్కు 91 శాతం. ఉత్కృష్ట సంస్థల్లో సీట్లు పరిమితం కాబట్టి వాటికోసం లక్షల సంఖ్యలో విద్యార్థులు పోటీపడుతున్నారు. దీనివల్ల విద్యార్థులపైన, తల్లిదండ్రులపైన తీవ్ర ఒత్తిడి పడుతోంది. ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుదామా అంటే అలవి కానంత ఫీజులు, డొనేషన్లు సమర్పించుకోవాలి. అంతచేసినా విద్యా ప్రమాణాలు గొప్పగా ఉంటాయన్న భరోసా లేదు. భారత్‌లోని 97 ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, ఐఐఎమ్‌లలో విద్యాభ్యాసం చేసేవారి సంఖ్య, దేశంలోని మొత్తం విద్యార్థుల్లో మూడు శాతానికి మించదు. అయినా, కేంద్ర ప్రభుత్వం విద్యాసంస్థలకు ఇచ్చే నిధుల్లో 50 శాతం ఈ సంస్థలకే దక్కుతోందని 2017లో మానవ వనరుల శాఖ స్వయంగా పార్లమెంటుకు తెలిపింది. 130 కోట్ల పైచిలుకు జనాభా ఉన్న భారత్‌లో కేవలం 1000 విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు ఉంటే- 30 కోట్ల జనాభా కలిగిన అమెరికాలో వాటి సంఖ్య 4,000కు పైనే. ప్రతిభావంతులకు అవి ఉపకార వేతనాలు, ఫీజుల తగ్గింపు వంటి సౌకర్యాలనూ అందిస్తున్నాయి. చదువుకుంటూనే కొన్ని గంటలు పనిచేసుకుంటూ తమ ఖర్చులు తాము సంపాదించుకునే సౌలభ్యంతోపాటు చదువు ముగిసిన వెంటనే ఉద్యోగాలు వచ్చే అవకాశమూ భారతీయ విద్యార్థులను సూదంటురాయిలా ఆకర్షిస్తోంది. విదేశాల్లో చదివినవారికి సంభాషణా చాతుర్యం, వ్యక్తిత్వ వికాసం, సామాజిక సంబంధాలు ఇనుమడిస్తాయి. స్వదేశంతోపాటు విదేశాల్లోనూ అనుభవం గడించినవారికి అంతర్జాతీయ కంపెనీలు ఉద్యోగాల్లో, పదోన్నతుల్లో ప్రాధాన్యమిస్తాయి. ఈ కారణాలు భారతీయ విద్యార్థులను విదేశాలకు తరలివెళ్లేట్లు పురిగొల్పుతున్నాయి.

భారతీయ విద్యార్థులు స్వదేశంలోనే ఉండాలంటే ఇక్కడ కూడా ఉపాధి అవకాశాలు ఇనుమడించాలి. ఆ పరిస్థితి ఇక్కడ ఉందా అంటే అనుమానమే. ఉదాహరణకు భారత్‌లో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో పట్టాలు పొందినవారిని స్వీకరించడానికి సెమీ కండక్టర్‌ పరిశ్రమలు కానీ, టెలికాం తయారీ సంస్థలు కానీ లేవు. మన ఐటీ కంపెనీలు స్వదేశీ, విదేశీ ఖాతాదారులకు ఒప్పంద సేవలు అందించడంపై పెట్టినంత శ్రద్ధ, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌ మీద పెట్టడంలేదు. ప్రస్తుతానికి ఐటీ పరిశ్రమ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్నా ఇతర పరిశ్రమల్లో అలాంటి పరిస్థితి లేదు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పట్టభద్రులను ఇముడ్చుకునే భారీ పరిశ్రమలూ లేవు. స్వదేశీ, విదేశీ కార్ల సంస్థలు రాబోయే విద్యుత్‌ వాహన యుగానికి కావలసిన బ్యాటరీలను, ఇతర పరికరాలను తయారుచేసే పరిశ్రమలు మన దేశంలో నెలకొనలేదు. అమెరికా, జర్మనీలతోపాటు చైనాలోనూ పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు ఆ రోజు కోసం ఇప్పటి నుంచే విద్యార్థులను సిద్ధం చేస్తున్నాయి. పాఠ్య ప్రణాళికల్లో మార్పులుచేర్పులు చేస్తున్నాయి. పాఠ్యపుస్తక పఠనంతోపాటు వర్క్‌షాపులో, ప్రయోగశాలలో కార్యాచరణ పాశ్చాత్య విద్యా విధానంలో అంతర్భాగాలు. విదేశీ విద్య ప్రస్తుతానికి గగన కుసుమంలా ఉన్నా విద్యార్థుల బదిలీ కార్యక్రమం కింద స్వదేశం నుంచే విదేశీ పట్టా పొందే అవకాశం ఉంది. ఇప్పటికే కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాలు ఈ కార్యక్రమం కింద భారతీయ విశ్వవిద్యాలయాలతో పొత్తు పెట్టుకున్నాయి. విద్యార్థులకు కొంతకాలం ఇక్కడ, కొంతకాలం అక్కడ విద్యాభ్యాసం చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

డిజిటల్‌ ఆశలు

గూగుల్‌, ఫేస్‌ బుక్‌, అమెజాన్‌, వాల్‌ మార్ట్‌ సంస్థలు ఇప్పటికే జియో తదితర భారతీయ సంస్థల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. రాబోయే డిజిటల్‌ యుగం కోసం రిలయన్స్‌ జియో సన్నద్ధమవుతోంది. స్వదేశంలో తానే 5జీ సేవలు అందిస్తానంటోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం స్వదేశంలో పారిశ్రామికోత్పత్తిని పెంచడానికి 600 అంతర్జాతీయ పెట్టుబడి సంస్థల్ని సంప్రతిస్తోంది. మోదీ పిలుపిచ్చిన ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలుచేయడానికి ఐఐటీ పూర్వ విద్యార్థుల మండలి రూ.21,000 కోట్ల మెగా నిధి ఏర్పాటు చేసింది. ఈ మండలి సభ్యుల్లో 100మందికి పైగా పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, 1000మందికి పైగా పీహెచ్‌డీ పట్టభద్రులు ఉన్నారు. ఇలాంటి దీక్షాపరులను మనదేశంలోనే మరిందర్ని తయారుచేసుకోవడానికి విద్యను కొద్దిమందికి కాకుండా మన యువతీయువకులందరికీ అందించాలి.

- వరప్రసాద్‌

Tags :

మరిన్ని