సింగపూర్‌ వేదికగా అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం
సింగపూర్‌ వేదికగా అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం

ఈనాడు, దిల్లీ: ‘శ్రీ సాంస్కృతిక కళాసారధి’ సంస్థ ఆవిర్భావం సందర్భంగా సింగపూర్‌ వేదికగా ఆదివారం అంతర్జాతీయ సాహిత్య సమ్మేళనం నిర్వహించారు. 14 దేశాలకు చెందిన 50 మంది సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు వక్తలుగా ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందేశం పంపించగా.. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌ సంస్థ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. తెలుగు సంస్కృతి గొప్పదనం ఇతివృత్తంగా రాధాకృష్ణ ఆధ్వర్యంలో సింగపూర్‌లోని తెలుగు వారందరూ కలిసి నిర్మించిన ‘అల సింగపురంలో...’ అనే లఘుచిత్ర ట్రైలర్‌, ఆస్ట్రేలియాలో ఉంటున్న ఉమా మహేశ్‌ రచించిన అక్షరోద్యమం పుస్తకాన్ని ఆవిష్కరించారు.  కవుటూరు రత్నకుమార్‌, భాస్కర్‌, శ్రీధర్‌, రామాంజనేయులు, సుధాకర్‌, రాధాకృష్ణ, విద్యాధరి, లక్ష్మి, రాధిక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అభినవ లవకుశలు కంభంపాటి సోదరులు, రెలారెరేలా జానకీరావు పాటలు, రాంబాబు పద్యాలు అందరినీ అలరించాయి. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా అధ్యక్షుడు వంగూరి చిట్టెన్‌రాజా, తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ అధ్యక్షుడు వెంకటాచారి, ప్రముఖ సినీ సంగీత విశ్లేషకుడు మ్యూజికాలజిస్ట్‌ రాజాలు అతిథులుగా పాల్గొని మాట్లాడారు.

విశిష్ట అతిథులైన పలువురు ప్రముఖుల సందేశాలు...
‘భారతీయ సంస్కృతి, కళలకు అద్దం పట్టే విధంగా మన సంగీత, సాహిత్య, చిత్రలేఖనం, నాట్యం, నాటకం, జానపదాలను, సనాతన సంప్రదాయాన్ని ప్రోత్సహించడం, భవిష్యత్తు తరాలకు ఈ విలువైన సంపదను అందించాలని సంస్థ లక్ష్యాలుగా నిర్దేశించుకోవడం ముదావహం. పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’  
- ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

కళా సాంస్కృతిక రంగాల్లోని లబ్దప్రతిష్టులైన వారందరి స్ఫూర్తిదాయక సందేశాలతో సంస్థకు విజయం సిద్ధించాలి’’ -సామవేదం షణ్ముఖశర్మ

‘‘సాహితీ ప్రియుల సమ్మేళనంలో పాల్గొనందుకు ఆనందగా ఉంది. సింగపూరులో ఉంటున్నా తెలుగు భాష పట్ల ప్రేమ, అభిమానం, ఆసక్తి పెంపొందించుకొనేలా కార్యక్రమాలు చేయడం అభినందనీయం’’  - రాంమాధవ్‌


‘‘సాహిత్యాన్ని మించిన గురువు లేదు. తెలుగు సాహిత్యం గురించి అందరూ తెలుసుకొంటూ మన జీవితంలో దాన్ని అన్వయించుకుంటే అన్ని సమస్యలు పటాపంచలు అవుతాయి’’ - గరికపాటి నరసింహారావు

Tags :

మరిన్ని