3 రాజధానులు వద్దు: కదం తొక్కిన ఎన్నారైలు
3 రాజధానులు వద్దు: కదం తొక్కిన ఎన్నారైలు

అమరావతి పోరాటానికి ప్రవాసాంధ్రులు సంఘీభావం తెలిపారు. కొవ్వొత్తులు చేపట్టి వివిధ దేశాల్లో నిరసన చేపట్టారు. మూడు రాజధానుల నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. న్యూజెర్సీ, ఫ్లోరిడా, డెట్రాయిట్‌, ఆర్కాసాన్స్‌, మినియాపోలిస్‌, డల్లాస్‌, సియాటెల్‌, కాలిఫోర్నియాలలో మేము సైతం అంటూ కదం తొక్కారు. కెనడా, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కువైట్, ఐర్లాండ్‌, జర్మనీలో నివసిస్తున్న తెలుగువారంతా అమరావతి ప్రాంత రైతులకు మద్దతు తెలిపారు. 

‘మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు’ అంటూ రాజధాని కోసం పోరాటం చేస్తున్న అమరావతి ప్రాంత రైతులకు మద్దతుగా ప్రవాసాంధ్రులు గళమెత్తుతున్నారు. భూములిచ్చిన రైతులకు మద్దతుగా అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న వారంతా  నిరసన చేపట్టారు. 200 రోజులుగా అమరావతి ప్రాంత వాసుల పోరాటం చేస్తున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని తరలింపు అంశంపై ప్రధాని కలగజేసుకోవాలని కోరుతున్నారు.

అమరావతి రాజధాని ప్రాంత రైతుల పోరాటానికి న్యూజెర్సీ రాష్ట్రం ఎడిసన్‌లో ప్రవాసాంధ్రులు సంఘీభావం తెలిపారు. కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఒకే రాష్ట్రం - ఒకే రాజధాని డిమాండ్‌తో కొనసాగుతున్న రైతు పోరాటానికి మద్దతుగా మేము సైతం అంటూ ఎన్నారైలు కదం తొక్కారు.  న్యూజెర్సీ ఎడిసన్ నగరంలో నాట్స్ మాజీ అధ్యక్షుడు మన్నవ మోహన్ కృష్ణ నాయకత్వంలో నిరసన ప్రదర్శన జరిగింది.  రాజధాని కోసం భూములిచ్చిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. గత ప్రభుత్వం చెప్పినట్టు అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలన్నారు. ప్రభుత్వాలు మారినా పాలసీలు మారకూడదన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

200 రోజులుగా అమరావతి రైతులు పడుతున్న కష్టం చూస్తుంటే తమకు చాలా బాధగా ఉందని  పలువురు ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. వాళ్ల కోరిక సరైనదని, గతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇచ్చిన నమ్మకాన్ని ఇప్పుడు వమ్ము చేస్తున్నారని విమర్శించారు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన ఒప్పందాన్ని తుంగలో తొక్కడం సరైంది కాదని హితవు పలికారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో తెలిపిన నిరసన కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వీడియో చూడండి.మరిన్ని