ట్రంప్‌నకు మద్దతుగా భారతీయ-అమెరికన్ల ప్రచారం!
ట్రంప్‌నకు మద్దతుగా భారతీయ-అమెరికన్ల ప్రచారం!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్‌ ట్రంప్‌నకు మద్దతు తెలుపుతూ పలువురు భారతీయ-అమెరికన్లు ఓ రాజకీయ కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేశారు. ఇక నుంచి ఈ కమిటీ ఆధ్వర్యంలో వీరంతా ట్రంప్‌నకు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నారు. దీనికి ఏ.డి.అమీర్‌ నేతృత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నాలుగేళ్ల పదవీ కాలంలో ట్రంప్‌ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అభిప్రాయపడ్డారు. దేశీయంగా, అంతర్జాయంగా నెలకొన్న అనేక సవాళ్లను అధిగమించారన్నారు. ఉగ్రవాదంపై తిరుగులేని పోరాటం కొనసాగించారని చెప్పుకొచ్చారు. వలస విధానాన్ని క్రమబద్ధీకరించే దిశగా అనేక మార్పులు చేశారన్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి అనేక చర్యలు తీసుకున్నారన్నారు. భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించాలంటే దానికి ట్రంపే సరైన వ్యక్తి అని వారంతా భావిస్తున్నట్లు తెలిపారు. రెండు ప్రధాన పార్టీల్లో ట్రంప్‌ కంటే సమర్థవంతమైన నాయకుడు తమకు ఎవరూ కనిపించడం లేదని.. అందుకే ఆయనకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. 2016లోనూ అమీర్‌ ట్రంప్‌నకు మద్దతుగా కమిటీని ఏర్పాటు చేశారు. నవంబర్‌ 3న జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌, డెమొక్రటిక్‌ పార్టీ నుంచి జో బైడెన్‌ బరిలో ఉన్న విషయం తెలిసిందే.


మరిన్ని