చైనాకు వ్యతిరేకంగా షికాగోలో నిరసనలు
చైనాకు వ్యతిరేకంగా షికాగోలో నిరసనలు

షికాగో: గల్వాన్‌ లోయలోని భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడి హింసాత్మక ఘటనలకు పాల్పడిన చైనాకు వ్యతిరేకంగా విదేశాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలోని షికాగోలో ఉన్న చైనా రాయబార కార్యాలయం ఎదుట పలువురు భారతీయ అమెరికన్లు డ్రాగన్‌ దేశానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. పొరుగున ఉన్న దేశాల్లో చైనా దురాక్రమణలకు పాల్పడుతోందని, ప్లకార్డులను ప్రదర్శిస్తూ చైనాకు వ్యతిరేక నినాదాలు చేశారు.

‘‘ భారత భూభాగంలోని లద్దాఖ్, లేహ్‌ ప్రాంతాల్లో చైనా చొరబాటుకు వ్యతిరేకంగా ఈ నిరసన చేపడుతున్నాం. ఆ దేశం చర్యలపట్ల భారతీయ అమెరికన్లు మౌనంగా ఉండరని ఈ సందర్భంగా చైనాకు స్పష్టం చేయదల్చుకున్నాం. ఈ పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం భారత్‌కు మద్దతుగా ఉంది’’ అని షికాగోకు చెందిన భారతీయ అమెరికన్ డాక్టర్‌ భరత్ బరాయ్‌ తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రజలు గుమిగూడటంపై షికాగోలో ఆంక్షలు ఉన్న నేపథ్యంలో అతి తక్కువ మందితో ఈ నిరసన చేపడుతున్నట్లు బరాయ్‌ పేర్కొన్నారు.

గత నెలలో తూర్పు లద్దాఖ్‌లోని పాంగాగ్ లేక్‌, గల్వాన్  లోయ, దెమ్‌చోక్‌, దౌలత్ బేగ్ ఓల్దీ ప్రాంతాల్లో చైనా బలగాలు భారత్ భూభాగంలోకి వచ్చేందుకు ప్రయత్నించడంతో వారిని భారత సైన్యం అడ్డుకుంది. ఈ నేపథ్యంలో గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 21 మంది భారత సైనికులు అమరులయ్యారు. దీంతో ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇర దేశాలు సైనిక, దౌత్య పరంగా చర్చలు జరుపుతున్నాయి. అయితే చైనా మాత్రం ఒకవైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున తన బలగాలను సరిహద్దులో మోహరించింది. భారత్ కూడా చైనాకు దీటుగా బదులిచ్చేందుకు అదనపు బలగాలను వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మోహరించింది. తాజాగా భారత్‌కు మద్దతుగా అమెరికా తన సైన్యాన్ని పంపేందుకు సిద్ధమని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో ప్రకటించారు.


మరిన్ని