లండన్‌లో పీవీ శత జయంతి వేడుకలు
లండన్‌లో పీవీ శత జయంతి వేడుకలు

లండన్‌: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు మాజీ ప్రధాని దివంగత పీవీ నరసింహారావు శత జయంతి వేడుకలను యూకేలో నిర్వహించనున్నట్టు తెలంగాణ ఎన్నారై ఫోరం అధ్యక్షుడు ప్రమోద్‌ గౌడ్‌ వెల్లడించారు. పీవీ జయంతి రోజున(ఈ నెల 28) వర్చువల్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ముఖ్యమైన ప్రవాస భారతీయులతో పీవీ సేవలు, దేశ నిర్మాణంపై ప్రసంగాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ, పీవీ నర్సింహారావు మనవడు సుభాష్‌ హాజరై మాట్లాడతారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్నారై ఫోరం వ్యవస్థాపకుడు గంప వేణుగోపాల్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.  

పీవీతో నాటి బ్రిటన్‌ ప్రధాని ప్రధాని జాన్‌ మేజర్‌ స్నేహం, భారత్ - బ్రిటన్‌లో సంబంధాలపై యూకే పార్లమెంట్‌ సభ్యుడు వీరేంద్ర శర్మ ప్రసంగించనున్నారు. ఈ వేడుకలకు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను సైతం ఆహ్వానించించినట్టు పేర్కొన్నారు. అలాగే, ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ఆచార్యుడు మనోహర్‌ ఆధునిక భారతదేశం నిర్మాణంలో పీవీ పాత్రపై ప్రసంగిస్తారని తెలిపారు. పీవీ శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ఎన్నారై ఫోరం తరఫున సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం చేపట్టిన కార్యక్రమంలో భాగస్వాములైనందుకు తమకెంతో ఆనందంగా ఉందన్నారు. 


మరిన్ని