అమెరికాలో విగ్రహాల ధ్వంసం ఉద్ధృతం
అమెరికాలో విగ్రహాల ధ్వంసం ఉద్ధృతం

చల్లారని జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమం

వాషింగ్టన్‌: అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ‘బ్లాక్‌ లైవ్స్‌ మ్యాటర్‌’ ఉద్యమం మరింత ఊపందుకుంది. అందులో భాగంగా నిరసనకారులు బానిసత్వాన్ని ప్రోత్సహించిన వారి విగ్రహాలను ధ్వంసం చేసే చర్యలను మరింత ఉద్ధృతం చేశారు. అమెరికా పితామహుడిగా గుర్తింపున్న దేశ మూడో అధ్యక్షుడు థామస్‌ జెఫర్‌సన్‌ విగ్రహాన్ని కూల్చేశారు. విగ్రహం అడుగున ఉండే దిమ్మెపై ‘బానిసల యజమాని’ అనే వ్యాఖ్యలు రాశారు. పోర్ట్‌ల్యాండ్‌లో థామస్‌ పేరుతో ఉన్న ఓ హైస్కూల్‌లో ఈ సంఘటన జరిగింది. థామస్‌ ఇంట్లో 600 మందికి పైగా బానిసలు ఉండేవారని అమెరికా చరిత్రకారులు విశ్వసిస్తుంటారు. మరోవైపు ప్రోవిడెన్స్‌ నగరంలో ప్రఖ్యాత నావికుడు క్రిస్టఫర్‌ కోలంబస్‌ విగ్రహం తలను కొందరు వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో సంబంధమున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కాగా ఫిలడెల్ఫియాలో ఉన్న క్రిస్టఫర్‌ కోలంబస్‌ విగ్రహాన్ని విధ్వంసకారుల నుంచి కాపాడుకుంటామంటూ వంద మందికి పైగా వ్యక్తులు తుపాకులు, బేస్‌బాల్‌ బ్యాట్లతో విగ్రహం వద్ద గుమిగూడారు. టహ్లెఖా, ఒక్లహోమాల్లో వంద సంవత్సరాల నాటి రెండు విగ్రహాలను నిరసనకారులు పెకిలించేశారు. కాగా అట్లాంటాలో పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన ఆఫ్రో అమెరికన్‌ రేషర్డ్‌ బ్రూక్స్‌కు నివాళిగా వెండీస్‌ రెస్టారెంట్‌ ముందు నిరసనకారులు తాత్కాలిక స్మారక చిహ్నం ఏర్పాటు చేశారు. రెస్టారెంట్‌ను దగ్ధం చేసిన ఘటనలో 36 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. అమెరికాలో జాతి వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావంగా ఐరోపా దేశాల్లోనూ నిరసనకారులు వీధుల్లోకి వస్తున్నారు. ఇటలీలోని మిలన్‌లో ఇండ్రో మొంటనెల్లి అనే ఓ జర్నలిస్ట్‌ విగ్రహంపై ‘జాత్యంకార వ్యక్తి’, ‘అత్యాచారానికి పాల్పడిన వ్యక్తి’ అనే వ్యాఖ్యలు రాశారు. జర్మనీలోని బెర్లిన్‌లో నిరసనకారులు 9 కిలోమీటర్ల పొడవున మానవహారం ఏర్పర్చి రంగుల రిబ్బన్లు పట్టుకుని జాతి వివక్షకు వ్యతిరేకంగా సందేశమిచ్చారు. బ్రిటన్‌లో జాతి వివక్షతో పాటు ఇతర అసమానతలను రూపుమాపే దిశగా ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఓ కొత్త కమిషన్‌ను ప్రకటించారు.
ఇండో అమెరికన్‌ మహిళ నాయకత్వం: అమెరికాలోని సీటెల్‌లో జరుగుతున్న జాతి వివక్ష వ్యతిరేక నిరసనల్లో క్షమా సావంత్‌ అనే ఇండో అమెరికన్‌ మహిళ కీలక పాత్ర పోషిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్న క్షమా, సీటెల్‌ కౌన్సిల్‌ ఉమన్‌గా కొనసాగుతున్నారు. అక్కడ నిరసనకారులు కొంత ప్రాంతాన్ని ఆక్రమించుకుని, పోలీసులకు ప్రవేశం లేకుండా ‘క్యాపిటల్‌ హిల్‌ అటానమస్‌ జోన్‌’ (చాజ్‌) పేరుతో స్వతంత్ర ప్రాంతంగా ప్రకటించుకోవడంలో ఆమె కీలకంగా వ్యవహరించారు. చాజ్‌ ప్రాంతాన్ని న్యాయాన్ని పరిరక్షించే కమ్యూనిటీ సెంటర్‌గా మార్చేలా కృషి చేస్తానని క్షమా చెబుతున్నారు.

Tags :

మరిన్ని