హెచ్‌-1బీ వీసాలు నిలిపివేయనున్నారా?
హెచ్‌-1బీ వీసాలు నిలిపివేయనున్నారా?

ట్రంప్ పాలకవర్గం యోచిస్తున్నట్లు ‘వాల్‌ స్ట్రీట్‌’ కథనం

వాషింగ్టన్‌: కరోనా సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న అమెరికాలో నిరుద్యోగం రికార్డు స్థాయికి చేరింది. దీంతో తిరిగి తమ పౌరులకు ఉపాధి కల్పించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ అనేక మార్గాలను అన్వేషిస్తున్నారు. అందులో భాగంగా పలు రకాల ఉద్యోగ, ఉపాధి వీసాలను కొంతకాలం పాటు నిలిపివేసే ప్రత్యామ్నాయాన్నీ పరిశీలిస్తున్నట్లు అక్కడి ఓ ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. 

అమెరికాలో భారతీయులు పెద్ద సంఖ్యలో ఉంటున్న విషయం తెలిసిందే. వీరిలో చాలా మంది వృత్తిపరమైన నిపుణులకు ఇచ్చే వలసేతర వీసా అయిన హెచ్‌-1బీపైనే ఉంటున్నారు. తాజాగా ట్రంప్‌ నిలిపివేయాలనుకుంటున్న ఉద్యోగ వీసాల్లో ఇది కూడా ఉన్నట్లు ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’ పేర్కొంది. అయితే, ఇది అమెరికా వెలుపల ఉన్నవారికి మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే ఆ దేశంలో ఉంటున్నవారిపై ఎలాంటి ప్రభావం ఉండకపోవచ్చునని పేర్కొంది. ఒకవేళ ట్రంప్‌ దీనికి ఆమోదముద్ర వేస్తే భారతీయ ఐటీ నిపుణులపై ప్రభావం పడే అవకాశం ఉంది. కరోనా సంక్షోభంలో చాలా మంది హెచ్‌-1బీ వీసాదారులు ఉద్యోగాలు కోల్పోయి భారత్‌కు తిరిగొచ్చారు. వీరు తిరిగి వెళ్లాలన్నా.. కొత్తగా ఎవరైనా అమెరికాలో ఉద్యోగం కోసం వెళ్లాలనుకున్నా కొంతకాలం పాటు సాధ్యం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ అంశంపై స్పందించిన వైట్‌ హౌస్‌.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. అమెరికా పౌరుల ఉపాధిని రక్షించేందుకు నిపుణులు అనేక మార్గాలు సూచించారని.. వాటన్నింటినీ వైట్‌ హౌస్‌ పరిశీస్తోందని అధికార ప్రతినిధి హోగన్‌ గిడ్లే తెలిపారు. హెచ్‌-1బీ సహా హెచ్‌-2బీ, జే-1, ఎల్‌-1 వీసాలు కూడా నిలిపివేయాలనుకుంటున్న జాబితాలో ఉన్నట్లు సమాచారం. 

దీనిపై ‘అమెరికా ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ సీఈవో థామస్‌ డోనో ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటున్న తరుణంలో అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల అవసరం కంపెనీలకు ఉందని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్రంప్‌నకు లేఖ రాశారు. ఉద్యోగ, ఉపాధి వీసాలను రద్దు చేయడం లేదా నిలిపివేయడం వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుందని లేఖలో స్పష్టం చేశారు. తిరిగి పుంజుకోవడానికి, ఉద్యోగ కల్పనకు ఇది ప్రతిబంధకంగా మారుతుందని వివరించారు.


మరిన్ని