అమెరికా ఉద్యోగాల బలమెంత..?
అమెరికా ఉద్యోగాల బలమెంత..?

మాంద్యంలోకి జారుకొన్న అగ్రరాజ్యం..
నిరుద్యోగుల శాతం లెక్కలపై భిన్నవాదనలు
వేగంగా కోలుకోవచ్చని ఆశాభావం

అగ్రరాజ్యం ఆర్థిక మాంద్యంలోకి జారుకొంది.. కానీ, ఊరటనిచ్చే విషయం ఏమిటంటే నిరుద్యోగుల సంఖ్య తగ్గింది..! ఇదీ ఇటీవల అమెరికాలోని నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చ్‌ సంస్థ వెల్లడించిన గణాంకాల సారాంశం. ఈ సంస్థ లెక్కల ప్రకారం నిరుద్యోగుల శాతం 14.7 నుంచి 13.3శాతానికి దిగివచ్చింది. ఈ గణాంకాలపై అమెరికాలోనే పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగులుగా చూపిస్తున్న వారిలో చాలా మందికి ఎటువంటి పనిలేదని.. కేవలం కరోనా సమయంలో తాత్కాలికంగా పెయిడ్‌ లీవ్‌ పొందుతున్న వారిని కూడా దీనిలో చూపించారని ప్రముఖ ఆంగ్ల పత్రిక బ్లూమ్‌బెర్గ్‌ కథనం ప్రచురించింది. ఏప్రిల్‌లో దేశంలోని నిరుద్యోగుల శాతం 19.7 ఉండగా.. అది మే నెలకు 16.3 శాతానికి దిగొచ్చింది.  ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఉద్యోగులను దీనిలో చూపించకపోతే మేలో కూడా నిరుద్యోగుల శాతం ఈ స్థాయిలో తగ్గదు. ఆర్థిక వ్యవస్థను మళ్లీ పూర్తిగా తెరిచాక కూడా ఉద్యోగులకు పని దొరికే అంశంపై భిన్నవాదనలు ఉన్నాయి. టీకా కానీ, వైద్యం కానీ లభించకపోతే ఉద్యోగాల పెరుగుదల వేగంగా ఉండకపోవచ్చు. 

దివాలా ముప్పు..!

ఆర్థిక వ్యవస్థలు మళ్లీ తెరిచాక మరో ముప్పు పొంచి ఉంది. చాలా సంస్థలు వ్యాపారాలు లేక దివాలాకు వెళ్లే ప్రమాదం ఉండటంతో నిరుద్యోగుల శాతం పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వేత్త జేడ్‌ కోల్‌కో అంచనా ప్రకారం అమెరికాలో శాశ్వత నిరుద్యోగం పెరుగుతూనే ఉంది. చాలా మంది ఎక్కువ కాలం పనికి దూరంగా ఉండటంతో వారి నైపుణ్యాలు కోల్పోయే ప్రమాదముంది.  వారు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడానికి అదో అడ్డంకిగా మారనుంది. చాలా మంది వ్యాపారవేత్తలు కరోనావైరస్‌ కారణంగా ఏర్పడ్డ ఆర్థిక సంక్షోభాన్ని తేలిగ్గా మర్చిపోలేకపోవచ్చు. వారిలోని నిరాశావాదం కారణంగా పెట్టుబడులు, వ్యాపార విస్తరణ వంటి అంశాలు మందగించే ప్రమాదముంది. దీనికి తోడు కొవిడ్‌ తర్వాత కాలంలో వ్యాపారాల సరళిలో వచ్చే మార్పులను తట్టుకునేలా సంస్థలు సిద్ధం కావాల్సి ఉంటుంది. చాలా వరకు ఆన్‌లైన్‌కే మొగ్గు చూపుతున్నారు.  వర్క్‌ ఫ్రమ్‌ హోం, ఇంటి నుంచే చిత్రాలను వీక్షించడం వంటివి పెరిగిపోతాయి. రీటైలర్లు, రెస్టారెంట్లు, వాణిజ్య సముదాయాలు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు వివిధ దేశాల దిగుమతులు తగ్గడంతో అమెరికా వంటి ఎగుమతి ఆధారిత దేశాల వ్యాపారాలపై ప్రభావం చూపనుంది. 

2008లో  మాంద్యంతో పోలిస్తే ఇప్పుడు అమెరికాలో ఉద్యోగాల కల్పన వేగంగా పుంజుకొంటోందని గణాంకాలు చెప్పటం మాత్రమే ఆశాజనకంగా ఉంది. అప్పట్లో ఇవి పుంజుకోవడానికి దాదాపు ఏడాది కాలం పట్టగా.. ఇప్పుడు మాత్రం కొన్ని నెలల్లోనే మళ్లీ పుంజుకొంటోంది.  కాకపోతే ఇది తాత్కాలికంగా మాత్రమే ఉంటే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయి. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే పాలసీల పరంగా జరిగే తప్పులు ఆర్థిక మాంద్యాన్ని తీవ్రం చేసే ప్రమాదం పొంచి ఉంది.  

Tags :

మరిన్ని