3 ఖండాల్లో కొనసాగిన నిరసనలు
3 ఖండాల్లో కొనసాగిన నిరసనలు

ఫ్లాయిడ్‌ ఉదంతంపై శాంతియుతంగా ర్యాలీలు

వాషింగ్టన్‌: అమెరికా పోలీసుల చేతిలో ఆఫ్రో అమెరికన్‌ పౌరుడు జార్జి ఫ్లాయిడ్‌ ప్రాణాలు కోల్పోవడాన్ని నిరసిస్తూ ఆస్ట్రేలియా, ఆసియా, ఐరోపా ఖండాల్లోని వేర్వేరు దేశాల్లో నిరసనలు కొనసాగాయి. ఆఫ్రో అమెరికన్లకు అనేకమంది మద్దతు పలికారు. జాతిపరమైన వివక్ష ఎంతమాత్రం తగదన్నారు. కరోనా ఆంక్షలను సైతం వారు తోసిరాజని ఆందోళనల్లో పాల్గొన్నారు. ఆందోళనకారులకు పోలీసులే మాస్కులు, శానిటైజర్లు ఇవ్వడం విశేషం. కరోనాతో కాకపోతే జాతి వివక్షతోనైనా తాము ప్రాణాలు కోల్పోయేలా ఉన్నామని కొందరు ఆందోళనకారులు నినదించారు. బ్రిస్బేన్‌లో రమారమి 30 వేల మంది ప్రజలు కదంతొక్కారు.
ప్రముఖ టెన్నిస్‌ తార సెరెనా విలియమ్స్‌ భర్త, రెడ్డిట్‌ సాంకేతిక సంస్థ సహ వ్యవస్థాపకుడు అలెక్సిస్‌ ఒహానియన్‌ తన బదులు ఆఫ్రో-అమెరికన్‌ వ్యక్తిని బోర్డులోకి తీసుకోవాలంటూ పదవికి రాజీనామా చేశారు. తన పెట్టుబడిపై వచ్చే రాబడిని జాతి విద్వేషంపై పోరాటానికి వినియోగిస్తానని చెప్పారు.
విద్వేషపూరిత సందేశాలు పంపిస్తున్న 200 ఖాతాలను తొలగించినట్లు ఫేస్‌బుక్‌ తెలిపింది.
జాతిపరమైన సమానత్వం, న్యాయం కోసం పోరాటానికి 10 కోట్ల డాలర్ల సాయాన్ని అందించనున్నట్లు జోర్డాన్‌ ప్రకటించింది.

Tags :

మరిన్ని