గాంధీ విగ్రహం ధ్వంసం పట్ల తీవ్ర నిరసన
గాంధీ విగ్రహం ధ్వంసం పట్ల తీవ్ర నిరసన

డాలస్: వాషింగ్టన్ డి.సి లో ఇండియన్ ఎంబసీకి ఎదురుగా ఉన్న మహాత్మగాంధీ విగ్రహాన్ని దౌర్జన్యకారులు ధ్వంసం చేయడాన్ని మహాత్మగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ ఛైర్మన్ డాక్టర్‌ ప్రసాద్ తోటకూర తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులను, గాంధేయవాదులను తీవ్రంగా కలచి వేసిందన్నారు. అమెరికాలో ప్రస్తుతం నెలకొని ఉన్న జాతి వివక్షత నిరసనకు, ఈ ధ్వంసానికి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో ఒక పోలీసు అధికారి అమానుష చర్య వల్ల మరణించిన ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతం ఒక అనాగరిక, పాశవిక చర్య అని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయని, అవి ఏ మాత్రం సమర్థనీయం కాదన్నారు. ఆఫ్రికన్ అమెరికన్ల ఆగ్రహానికి, ఆవేదనకు, నిరసనకు అర్థం ఉందని, తప్పనిసరిగా అందరూ మద్దతు పలకాలని ప్రసాద్ అన్నారు. ఐతే ఆఫ్రికన్ అమెరికన్లకు న్యాయం జరగాలని ఏ ఉద్దేశంతో ఈ ఆందోళన ప్రారంభించారో, గత పది రోజులుగా జరుగుతున్న ఈ దౌర్జన్యాలు, దహనకాండ, ధ్వంసంతో ఆ ఆశయం పక్కమార్గం పట్టి దహనాలు, దోపిడీలు, విధ్వంసాలకు దారి తీయడం శోచనీయం అన్నారు.

ముఖ్యంగా ఆఫ్రికన్ అమెరికన్ల ఆత్మ గౌరవాన్ని, వారి హక్కుల కోసం నిరంతర పోరాటం సలిపిన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ లాంటి నాయకులు మహాత్మగాంధీని ఆదర్శంగా తీసుకొని శాంతియుత పంథాలో ఉద్యమాలను నిర్వహిస్తే, అదే గాంధీ విగ్రహాన్ని ఇప్పుడు ధ్వంసం చేయడం ఒక అనాలోచిత చర్య అని డాక్టర్‌ ప్రసాద్‌ తోటకూర పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అగ్నికి ఆజ్యం పోసేలా ప్రభుత్వాధికారుల వ్యాఖ్యలు ఉండరాదన్నారు. ఈ నిరసనల్లో చాలామంది పోలీసులు కూడా తమ ప్రాణాలను కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.


మరిన్ని