వీసా నిబంధనలు సడలించిన కేంద్రం
వీసా నిబంధనలు సడలించిన కేంద్రం

దిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తాజాగా వాటిలో కొన్ని సడలింపులు ప్రకటించింది. ఇతర దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, ఇంజినీర్లు, ఆరోగ్య, సాంకేతిక సిబ్బంది భారత్‌కు వచ్చేందుకు అనుమతించింది. వీరిని హోంశాఖ నాలుగు కేటగిరీలుగా విభజించింది. వారంతా సొంత విమానాలు లేదా నాన్‌ కమర్షియల్‌ విమానాల్లో మాత్రమే భారత్‌కు వచ్చేందుకు అనుమతించనున్నట్లు ప్రకటించింది.  

* మొదటి కేటగిరీలో విదేశీ వ్యాపారవేత్తలు భారత్‌లో అడుగుపెట్టవచ్చని తెలిపింది. అయితే వీరంతా కొత్తగా వీసా దరఖాస్తు చేసుకోవడం లేదా గతంలో పొందిన వీసాను రీవాల్యుడేట్ చేసుకోవాలని సూచించింది.

* రెండో కేటగిరీలో భారత్‌లో ఆరోగ్య సేవలు అందించే గుర్తింపు పొందిన సంస్థల ఆహ్వానం ఉన్న ఆరోగ్య సిబ్బంది రావచ్చని తెలిపింది. అలానే లేబొరేటరీలు, ఫ్యాక్టరీలు, ఫార్మా కంపెనీలు, గుర్తింపు పొందిన యూనివర్శిటీల్లో ఉపయోగించే మెషీన్లు బాగుచేసే సాంకేతిక సిబ్బందిని అనుమతించనున్నట్లు ప్రకటించింది.  

*మూడో కేటగిరీలో విదేశీ ఇంజనీర్లు, వివిధ సంస్థల నిర్వాహకులు, డిజైనర్లు మరియు ఇతర సాంకేతిక సిబ్బంది, అలానే భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించే విదేశీ వ్యాపార  సంస్థల (తయారీ, డిజైన్‌, సాఫ్ట్‌వేర్, ఆర్థిక‌) సిబ్బందికి అనుమతులు మంజూరు చేసింది.  

* నాలుగో కేటగిరీలో విదేశాల్లో తయారైన యంత్రాల ఇన్‌స్టాలేషన్, నిర్వహణకు సంబంధించిన సాంకేతిక సిబ్బంది గుర్తింపు పొందిన సంస్థల ఆహ్వానం మేరకు  రావచ్చని తెలిపింది.  

కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. అయితే దేశ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించడంలో భాగంగా హోం మంత్రిత్వ శాఖ తొలిసారిగా విదేశీయులను భారత్‌లోకి వచ్చేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 


మరిన్ని