అమెరికాలో ఉద్యోగాలు ఊడుతూనే ఉన్నాయి!
అమెరికాలో ఉద్యోగాలు ఊడుతూనే ఉన్నాయి!

4.1 కోట్లకు చేరుకున్న నిరుద్యోగ భృతి దరఖాస్తుదారుల సంఖ్య

వాషింగ్టన్: కరోనా షట్‌డౌన్ తర్వాత అమెరికా ఆర్థిక వ్యవస్థ తిరిగి తెరుచుకుంటున్నప్పటికీ.. ఉద్యోగాల కోత మాత్రం ఆగడం లేదు. గత వారం దాదాపు 21 లక్షల మంది కొత్తగా నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటి వరకూ ప్రభుత్వ ప్రయోజనాల కోసం దరఖాస్తు చేసుకున్నవారి సంఖ్య 4.1 కోట్లకు చేరింది. దీన్ని బట్టి కరోనా సంక్షోభ ప్రభావం వ్యాపారాలపై ఇంకా కొనసాగుతోందని అర్థమవుతోంది. ఏప్రిల్‌లో అమెరికాలో నిరుద్యోగిత రేటు 14.7 శాతానికి చేరింది. మహా మాంద్యం తర్వాత ఇదే అత్యధికం. ఈ నెలలో ఇది 20 శాతం వరకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు.

అయితే, అక్కడి లేబర్‌ డిపార్ట్‌మెంట్‌ మరో ఆసక్తికర అంశాన్ని కూడా వెల్లడించింది. వైరస్‌ విజృంభణ తీవ్ర స్థాయిలో ఉన్న సమయంలో 2.5 కోట్ల మంది నిరుద్యోగ భృతి పొందారని.. ఇది ప్రస్తుతం 2.1 కోట్లకు చేరిందని తెలిపింది. అంటే కంపెనీలు తెరుచుకున్న తర్వాత ఉద్యోగులను తిరిగి నియమించుకుంటున్నట్లు అర్థమవుతోందని అభిప్రాయపడింది. మరోవైపు ఇప్పటి వరకు ఉద్యోగాలు కోల్పోయిన వారిలో చాలా మంది తిరిగి కంపెనీలకు రాకపోవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండంకెల నిరుద్యోగిత రేటు 2021లోనూ కొనసాగొచ్చని అంచనా వేశారు. అమెరికాలో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య లక్ష దాటింది.

Tags :

మరిన్ని