హెచ్‌-1బీ జారీలో వారికే తొలి ప్రాధాన్యం..!
హెచ్‌-1బీ జారీలో వారికే తొలి ప్రాధాన్యం..!

హెచ్‌-1బీ, ఎల్‌-1 విధానంలో సంస్కరణలు ప్రతిపాదిస్తూ బిల్లు

వాషింగ్టన్‌: హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసా జారీ విధానంలో కీలక సంస్కరణలు ప్రతిపాదిస్తూ అమెరికా చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టారు. అమెరికాలో చదివిన విదేశీ నిపుణులకు తొలి ప్రాధాన్యం లభించేలా చూడడమే లక్ష్యంగా ఈ బిల్లును రూపొందించారు. అలాగే, అమెరికా పౌరుల ఉపాధి కాపాడడం కూడా ఓ ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ మేరకు రెండు పార్టీలకు చెందిన ప్రతినిధుల బృందం శుక్రవారం ‘ది హెచ్‌-1బీ అండ్‌ ఎల్‌-1 వీసా రిఫార్మ్‌ యాక్ట్‌’ పేరిట చట్టసభల్లో బిల్లు ప్రవేశపెట్టారు.

అమెరికన్ల స్థానాన్ని భర్తీ చేయడాన్ని నిషేధించాలి..

ఉన్నత విద్య, నైపుణ్యం కలిగి అమెరికాలో చదువుకున్న చురుకైన విద్యార్థులకు హెచ్‌-1బీ వీసా జారీలో తొలి ప్రాధాన్యం ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదించారు. అమెరికా ఉద్యోగుల స్థానాన్ని హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాదారులు భర్తీ చేయడాన్ని పూర్తిగా నిషేధించాలని పేర్కొన్నారు. అలాగే ఈ వీసాదారుల వల్ల ఇతర అమెరికా ఉద్యోగులు, కార్మికుల పనితీరు, పనిప్రదేశంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలని స్పష్టం చేశారు. ముఖ్యంగా తాత్కాలిక శిక్షణా ప్రయోజనాల కోసం పెద్ద సంఖ్యలో హెచ్‌-1బీ, ఎల్‌-1 ఉద్యోగులకు దిగుమతి చేసుకొని తిరిగి వారిని సొంతదేశానికి పంపుతున్న అవుట్‌సోర్సింగ్‌ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని బిల్లు ప్రతిపాదించింది. 50కంటే ఎక్కువ మంది పనిచేస్తూ వారిలో సగం కంటే ఎక్కువ మంది హెచ్‌-1బీ లేదా ఎల్‌-1 వీసాదారులు ఉన్నట్లయితే.. మరింత మంది హెచ్‌-1బీ వీసాదారుల్ని నియమించుకోవడాన్ని నిషేధించాలని ఈ బిల్లు  ప్రతిపాదించింది.

లేబర్‌ డిపార్ట్‌మెంట్‌కు మరిన్ని అధికారాలు..

ఉద్యోగుల నియామకాలు, వీసా నిబంధనల విషయంలో ఆయా కంపెనీల యాజమాన్యాలు నిబంధనల ప్రకారం నడుచుకునేలా చూసేందుకు లేబర్‌ డిపార్ట్‌మెంట్‌కు మరిన్ని అధికారాల్ని బిల్లులో కట్టబెట్టారు. నిబంధనల్ని ఉల్లంఘించినట్లు తేలితే శిక్షించే అధికారాన్ని కూడా ప్రతిపాదించారు. కంపెనీలు హెచ్‌-1బీ, ఎల్‌-1 వీసాదారుల సమగ్ర వివరాలు అందజేసేలా చూడాలని బిల్లులో పేర్కొన్నారు.

ఎల్‌-1లో మార్పులివే..

హెచ్‌-1బీ వీసాతో పాటు ఎల్‌-1వీసా విధానంలోనూ కీలక మార్పులు సూచించారు. వీటిలో, ఎల్‌-1 ఉద్యోగులకు కనీస వేతన నిర్ధారణ, కంపెనీలు ఎల్‌-1 నిబంధనలకు కట్టుబడి ఉండేలా ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగానికి అధికారాలు, కంపెనీల్లో అంతర్గత బదిలీలు చట్టబద్ధమైన శాఖల మధ్య జరగడం, ఎల్‌-1 వీసాలు కీలకమైన వ్యక్తులకు మాత్రమే దక్కేలా ‘స్పెషలైజ్డ్‌ నాలెడ్జ్‌’ నిర్వచనాన్ని మార్చడం వంటి ప్రధాన ప్రతిపాదనలు ఉన్నాయి.

కొంతమంది నిబంధనలు ఉల్లంఘిస్తున్నందునే మార్పులు..

కొన్ని అమెరికన్‌ కంపెనీలు వీసా నిబంధనల్ని ఉల్లంఘిస్తూ తక్కువ వేతనాలతో పనిచేసేవారిని ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయని బిల్లు ప్రవేశపెట్టిన వారిలో ఒకరైన ప్రముఖ చట్టసభ ప్రతినిధి గ్రాస్లీ అభిప్రాయపడ్డారు. దీని వల్ల స్థానిక అమెరికన్లు ఉపాధి కోల్పోతున్నారన్నారు. అలాగే నైపుణ్యం గల అమెరికన్లు, వీసాదారులకు న్యాయం చేయాలనే లక్ష్యంతోనే ఈ మార్పులను ప్రతిపాదించామని తెలిపారు.మరిన్ని