రూ.226 లక్షల కోట్ల ప్యాకేజీ
రూ.226 లక్షల కోట్ల ప్యాకేజీ

కొవిడ్‌ కష్టాలు తీర్చేందుకు అమెరికా స్పీకర్‌ ప్రతిపాదన

వాషింగ్టన్‌: కరోనా దెబ్బకు ఎదురైన కల్లోల పరిస్థితులను ఎదుర్కొనేందుకుగాను అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ సుమారు రూ.226 లక్షల కోట్ల (3 ట్రిలియన్‌ డాలర్ల) ప్యాకేజీని ప్రతిపాదించారు. ఆర్థిక వ్యవస్థల్లో తిరిగి జవసత్వాలు నింపేందుకుగాను రాష్ట్రాలకు నిధులు సమకూర్చడం, కరోనాపై ముందుండి పోరాడుతున్న అత్యవసర సేవల సిబ్బందికి ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం వంటి అంశాలను సంబంధిత బిల్లులో పొందుపర్చారు. దీనిపై సభలో శుక్రవారం ఓటింగ్‌ జరిగే అవకాశముంది. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లదే మెజారిటీ కాబట్టి అక్కడ బిల్లు ఆమోదం పొందడం దాదాపుగా లాంఛనప్రాయమే! రిపబ్లికన్ల ఆధిపత్యమున్న సెనేట్‌లో దానికి ఆమోద ముద్ర పడటం మాత్రం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది. నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా స్తబ్ధుగా ఉంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సివస్తుందని పెలోసీ హెచ్చరించారు. ఒక్కో కుటుంబానికి దాదాపు రూ.4.5 లక్షల మేర ఆర్థిక సహాయం అందించాలని బిల్లులో ప్రతిపాదించినట్లు తెలిపారు. అద్దె చెల్లింపులు, కరోనా పరీక్షలు, ఆహార స్టాంపులు, ఉద్యోగాలు కోల్పోయినవారికి రాయితీల వంటి అంశాలకు నిధులు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
చైనాపై ఆంక్షలకు సెనేటర్ల బిల్లు
కరోనా వైరస్‌.. మహమ్మారిగా మారడానికి దారితీసిన పరిస్థితులకు సంబంధించి చైనా పూర్తి సమాచారాన్ని ఇవ్వకపోయినా, దర్యాప్తునకు సహకరించకపోయినా ఆ దేశంపై ఆంక్షలు విధించాలని అమెరికా భావిస్తోంది. ఈ మేరకు చైనాపై ఆంక్షలు విధించేలా అధ్యక్షుడు ట్రంప్‌నకు అధికారమిచ్చేందుకు ఉద్దేశించిన బిల్లును తొమ్మిది మంది సెనేటర్లు కాంగ్రెస్‌లో ప్రవేశపెట్టారు. ‘ది కొవిడ్‌-19 అకౌంటబిలిటీ యాక్ట్‌’ పేరిట సెనేటర్‌ లిండ్సే గ్రాహం రూపొందించిన బిల్లుకు మరో ఎనిమిది మంది సెనేటర్లు మద్దతిచ్చారు. అందరూ కలిసి కాంగ్రెస్‌ ఎగువ సభ అయిన సెనేట్‌లో దానిని ప్రవేశపెట్టారు. అమెరికా, దాని మిత్రపక్షాలు లేదా ఐరాస అనుంబంధ సంస్థలు చేపట్టే దర్యాప్తునకు అవసరమైన సమాచారం చైనా ఇచ్చిందా? లేదా? అన్న విషయాన్ని అధ్యక్షుడు 60 రోజుల్లోగా కాంగ్రెస్‌కు తెలియజేయాలని అందులో ప్రస్తావించారు. చైనాలోని జంతు మాంస విక్రయ మార్కెట్లను మూసివేయాలని సెనేటర్లు డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని