శ్వేతసౌధంలో కొవిడ్‌ కలకలం
శ్వేతసౌధంలో కొవిడ్‌ కలకలం

ఇవాంక సహాయకురాలికి సోకిన వైరస్‌...
అమెరికా ఉపాధ్యక్షుని మీడియా కార్యదర్శికీ..
ట్రంప్‌ సహాయకుడితో కలిపి వారంలో మూడుకు చేరిన బాధితుల సంఖ్య

వాషింగ్టన్‌/మాస్కో: అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్‌ ఆ దేశ అధ్యక్ష భవనాన్నీ వదల్లేదు. అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంక సహాయకురాలికి, ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ మీడియా కార్యదర్శి కేటీ మిల్లర్‌కు తాజాగా కొవిడ్‌-19 పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దీంతో ఈ వారంలో శ్వేతసౌధంలో వైరస్‌ బారిన పడిన వారి సంఖ్య మూడుకు చేరింది. సహాయకురాలు కొన్ని వారాలుగా ఇవాంకతో లేరని.. అందువల్ల ఎలాంటి ప్రమాదం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇవాంకకు, ఆమె భర్త జేర్డ్‌ కుష్నర్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కరోనా సోకలేదని వెల్లడైందని ఓ అధికారి తెలిపినట్లు ‘సీఎన్‌ఎన్‌’ పేర్కొంది. మైక్‌ పెన్స్‌ సహాయకురాలు కేటీ మిల్లర్‌ విధి నిర్వహణలో భాగంగా శ్వేతసౌధంలో నిర్వహించిన అనేక కీలక సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ట్రంప్‌,  పెన్స్‌లకు కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, వారిద్దరికీ నెగెటివ్‌ అని తేలింది. ఇకపై వారిరువురికీ ప్రతిరోజూ కరోనా పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారిక వర్గాలు తెలిపాయి. అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ.. శ్వేతసౌధంలో కరోనా కేసులు వెలుగు చూడడంపై తానేమీ ఆందోళన చెందడం లేదని స్పష్టంచేశారు. అదే సమయంలో అధికారులు మాత్రం భద్రతా విధానాలను కఠినతరం చేయనున్నట్లు వెల్లడించారు. మిల్లర్‌ భర్త స్టీఫెన్‌ అధ్యక్షుడికి సలహాదారుగా ఉన్నారు. ఆయనకు వైరస్‌ సోకిందా? లేదా? అన్న విషయంపై శ్వేతసౌధం స్పందించాల్సి ఉంది. ట్రంప్‌ సహాయకుల్లో ఒకరు గురువారం మహమ్మారి బారిన పడిన సంగతి తెలిసిందే. మరోవైపు, ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌-19 కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం నాటికి మొత్తం బాధితుల సంఖ్య 40 లక్షలు దాటింది.

మృతుల సంఖ్య 2.78 లక్షలు దాటింది. 60వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి.

* న్యూయార్క్‌లో ముగ్గురు చిన్నారులు కరోనాతో సంబంధమున్నట్లు భావిస్తున్న అరుదైన ఇన్‌ఫ్లమేటరీ (కవాసాకి లాంటి) వ్యాధితో మరణించడంపై అక్కడి వైద్య సంరక్షణ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీరిలో రక్తనాళాలు ఉబ్బటం, గుండె సంబంధిత ఇబ్బందులు కనిపించాయని గవర్నర్‌ ఆండ్రూ కౌమో చెప్పారు. ఇప్పటి వరకు  73 మంది పిల్లలు ఆసుపత్రుల్లో చేరారు.

*  ఒహాయోలోని నర్సింగ్‌ హోమ్‌లలో మరణిస్తున్నవారి సంఖ్య పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నర్సింగ్‌ హోమ్‌లలో చికిత్స పొందుతున్న వారిలో 500 మంది కొవిడ్‌-19 సోకి మరణించారు.

రష్యాలో ఏడో రోజూ పది వేల కేసులు
కరోనా బారిన పడి రష్యా వణుకుతోంది. శుక్రవారం నుంచి శనివారం వరకు  ఆ దేశంలో 10,817 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయి. 104 మంది మరణించారు. ఏడో రోజూ కొత్త కేసుల సంఖ్య పదివేల మార్క్‌ని దాటింది. ఒక్క రాజధాని మాస్కోలోనే 5,667 ఉండడం గమనార్హం.

దక్షిణ కొరియాలో 2,100 బార్లు మూసివేత
కరోనా కేసులు మళ్లీ నమోదవుతుండడంతో దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో శనివారం 2,100  బార్లు, రాత్రిపూట తెరిచి ఉంచే దుకాణాలు, డిస్కోలను మూసివేశారు. ఆ దేశంలో శనివారం 18 కేసులు నమోదవగా, కేసుల సంఖ్య 10,840కి చేరింది. జర్మనీలో తాజాగా 55 కేసులు నమోదవగా మొత్తం కేసుల సంఖ్య 1.70 లక్షలు దాటింది.
* ఇంగ్లండ్‌లో ఆరు వారాల శిశువు కరోనా కారణంగా శుక్రవారం మరణించింది. దీంతో బ్రిటన్‌లో వైరస్‌ బారిన పడి మరణించిన పిన్న వయస్కురాలు ఈమేనని భావిస్తున్నారు. బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మాట్లాడుతూ.. ఆర్థిక వ్యవస్థను తిరిగి ప్రారంభించేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు.
*  హాంకాంగ్‌లో వరుసగా 20వ రోజూ ఒక్క కరోనా కేసు కూడా వెలుగుచూడలేదు.
* కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించాలని పాకిస్థాన్‌ నిర్ణయించింది. సోమవారం నుంచి గురువారం వరకు దుకాణాలు తెరవడానికి అనుమతి ఇచ్చింది. మిగిలిన 3 రోజులు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్‌ అమలవుతుంది.

Tags :

మరిన్ని