అమెరికాలో ఉద్యోగులకు గడ్డు కాలమే!
అమెరికాలో ఉద్యోగులకు గడ్డు కాలమే!

‘ఈనాడు’తో అమెరికాలో ఇమిగ్రేషన్‌ అటార్నీ సంతోష్‌ ఆర్‌ సోమిరెడ్డి
ఈనాడు, హైదరాబాద్‌

‘అమెరికాలో ఉద్యోగులకు రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితే.అమెరికా జాతీయుల్లో నిరుద్యోగం భారీగా పెరుగుతోంది. ఆ ప్రభావం భారతీయుల ఉద్యోగావకాశాలపై అనూహ్యంగా ఉంటుంది. అమెరికాలో అర మిలియన్‌ మందికిపైగా తెలుగువాళ్లు హెచ్‌1బీ వీసాలపై ఉద్యోగాలు చేస్తుంటారు. అక్టోబరు-డిసెంబరు మధ్య కాలంలో వీరిలో 30 నుంచి 40 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ఇమిగ్రెంట్‌ వీసాలను ఆరు నెలలపాటు నిలుపుదల చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఆ తరవాత ఎలా వ్యవహరించాలన్న అంశంపై  30 రోజుల్లో విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు. దీని వల్ల వచ్చే ప్రమాదం కన్నా అమెరికన్లలో పెచ్చుమీరుతున్న నిరుద్యోగమే పెద్ద సమస్య. గ్రీన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న హెచ్‌1బీ ఉద్యోగులకూ ఇబ్బంది తప్పదు. అయితే ఆ దరఖాస్తుదారుల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు నాలుగైదు వేల మందికి మించి ఉండకపోవచ్చు’ అని అమెరికా ఇమిగ్రేషన్‌ అటార్నీ సంతోష్‌ ఆర్‌ సోమిరెడ్డి చెప్పారు. అమెరికాలో ఉద్యోగుల స్థితిగతులపై ఆయన ‘ఈనాడు’తో ఫోన్‌లో మాట్లాడారు.


వారానికి 20 గంటలూ పని చేయవచ్చు

నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌1బీ ఉద్యోగాన్ని తొలగించినా, బెంచ్‌పై తీసుకువచ్చినా చట్టపరంగా వ్యాజ్యం దాఖలు చేస్తే ఉద్యోగమో, నష్టపరిహారమో పొందవచ్చు. హెచ్‌1బీపై ఉన్న వారు వారానికి 40 గంటలు పని చేస్తారు. ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం పోయిందని ఆందోళన పడొద్దు. హెచ్‌1బీలో వారానికి 20 గంటలు పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. అదీ కాదంటే వీసా స్థితిని మార్చుకుని మరో ఉద్యోగం చూసుకోవచ్చు. ఇలా మారాలంటే ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయకుండా ఉద్యోగం చేయటం చట్టవిరుద్ధం. ఉద్యోగం కోల్పోతే మాత్రం అక్కడి నిబంధనల ప్రకారం 60 రోజుల్లో మాతృదేశం వెళ్లాల్సిందే.


30 మిలియన్లకు చేరిన నిరుద్యోగులు

అమెరికాలో ఇంతకు ముందెన్నడూ లేనంతగా నిరుద్యోగుల సంఖ్య 30 మిలియన్లకు చేరింది. రానున్న రోజుల్లో ఆ సంఖ్య ఎంతకు చేరుతుందో అంచనా వేయటం కష్టం. లాక్‌డౌన్‌తో పోయిన ఉద్యోగాన్ని భారతీయులు మళ్లీ దక్కించుకోవటం చాలా కష్టం. నిరుద్యోగులైన అమెరికన్లకే ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పటికే చమురు, విమానాలు, క్రూయిజ్‌ రంగాల్లో ఉద్యోగాలు పోయాయి. రానున్న రోజుల్లో రిటైల్‌, సాఫ్ట్‌వేర్‌, ఆర్థిక రంగాలపై ప్రభావం పడుతుంది. ఆయా రంగాల్లోనూ కోత తప్పదు. కొన్ని కంపెనీలు దివాలా ప్రక్రియలోకి వస్తాయి. ద్రవ్యోల్బణం పెరుగుతుంది. నిత్యావసర వస్తువుల ధరలూ పెరుగుతాయి. 2007-09లో వచ్చిన ఆర్థిక మాంద్యం కంటే రానున్న నెలల్లో అమెరికా ఆర్థిక రంగం విపత్కర పరిస్థితులు ఎదుర్కోనుంది. ఆర్థిక మాంద్యం రోజుల్లో కంటే 60 నుంచి 70 శాతం ప్రభావం అధికంగా ఉంటుందని అంచనా.


ఓపీటీ ఉద్యోగాలు కష్టం

 

సాధారణంగా అమెరికాలో అండర్‌ గ్రాడ్యుయేట్‌, గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు ఓపీటీ(ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌)కింద పనిచేయడానికి తాత్కాలికంగా అనుమతిస్తుంటారు. ఇది సంవత్సరం నుంచి రెండేళ్ల వరకు ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఉద్యోగాలు వెతుక్కోవటం విద్యార్థులకు చాలా కష్టం. 75 శాతం మందికి పైగా ఎదురుచూడక తప్పని పరిస్థితి. ఆ ఉద్యోగాలకు అమెరికా పౌరుల నుంచి గట్టి పోటీ ఎదురవుతుంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వమిస్తున్న ఉద్దీపన పథకంలో తెలుగు విద్యార్థులకు చోటు దొరకటం చాలా కష్టం. అధికారికంగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదై.. ఉద్యోగాలు చేస్తున్న విద్యార్థులు తక్కువగా ఉండటమే ఇందుకు కారణం. ప్రభుత్వ ఆదాయం ఇప్పటికే గణనీయంగా ప్రభావితమైంది. డిసెంబరులోగా కరోనాకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాకపోతే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. విద్యాసంస్థలకు నిధుల కొరత ఏర్పడి   ఫీజులు పెంచే ప్రమాదం కూడా ఉంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గృహహింస కేసులు ఎక్కువయ్యాయి. అమెరికా వారివే కాదు భారతీయుల కేసులూ వస్తున్నాయి. మునుపటితో పోలిస్తే ఈ కేసులు రెండింతలు పెరిగాయి’ అని సంతోష్‌ వివరించారు.

Tags :

మరిన్ని