యూఏఈలో చిక్కుకున్నవారి కోసం..
యూఏఈలో చిక్కుకున్నవారి కోసం..

ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియ ఆరంభించిన భారత్‌

దుబాయ్‌: లాక్‌డౌన్‌ కారణంగా అరబ్బు దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులకు శుభవార్త! స్వదేశానికి తిరిగి రావాలనుకుంటున్న వారి కోసం యూఏఈలోని భారత దౌత్య, రాయబార కార్యాలయాలు ఆన్‌లైన్‌ నమోదు ప్రక్రియను ఆరంభించాయి. దుబాయ్‌లోని భారత కాన్సలేట్‌ వెబ్‌సైట్‌ ద్వారా నమోదు ప్రక్రియ ఆరంభించామని అబుదాబిలోని భారత దౌత్య కార్యాలయం తెలిపింది.

భారత్‌కు వెళ్లాలనుకునే వారు www.indianembassyuae.gov.in లేదా www.cgidubai.gov.in వెబ్‌సైట్లలో లాగిన్‌ వివరాలు నమోదు చేసుకోవాలని భారత దౌత్యకార్యాలయం ట్వీట్‌చేసింది. www.cgidubai.gov.in/covid_registerలోనూ నమోదు చేసుకోవచ్చని వెల్లడించింది. సాంకేతిక సమస్యతో కొంతసేపటికి ఈ లింక్‌ పనిచేయకపోవడంతో తొలగించి గురువారం పునరుద్ధరించారు. ఎక్కువ లోడ్‌ ఉండటం వల్ల లింక్‌ తెరచుకొనేందుకు కొంత సమయం పట్టొచ్చని సూచన చేసింది.

ఎంతమంది స్వదేశానికి వెళ్లాలనుకుంటున్నారో తెలుసుకొనేందుకే భారత ప్రభుత్వం ఈ సమాచారం సేకరిస్తోందని అబుదాబి మిషన్‌ పేర్కొంది. వాటి ఆధారంగానే ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తారని వెల్లడించింది. ప్రస్తుత ఫామ్‌ను ఒక సారి ఒక్కరే నింపాల్సి ఉంటుందని, కుటుంబంలోని ప్రతి ఒక్కరికి వేర్వేరుగా ఫామ్‌ను నింపాలని సూచించింది. కంపెనీల విషయానికొస్తే ఉద్యోగులు సైతం వేర్వేరుగానే నింపాలని పేర్కొంది. అయితే ప్రయాణాలు ఎప్పుడు మొదలవుతాయన్నది భారత్‌ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. వేల సంఖ్యలో భారతీయులు దరఖాస్తులు చేసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

చదవండి: శునకాలు కరోనా రోగుల్ని పసిగట్టగలవా?

చదవండి: సీనియర్‌ ‘కిమ్’ మృతిపైనా అప్పట్లో ఇలాంటి వార్తలే


మరిన్ని