అమెరికాలో భారతీయుల కోసం కరోనా హెల్ప్‌లైన్లు
అమెరికాలో భారతీయుల కోసం కరోనా హెల్ప్‌లైన్లు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) మహమ్మారి 69 మందిని బలి తీసుకుంది. మరో 3,777 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కరోనాను నిలువరించటానికి పర్యటనలపై ఆంక్షలు, పాఠశాలలు, హోటళ్లు తదితర బహిరంగ స్థలాల మూసివేత వంటి అనేక చర్యలను అమెరికా చేపట్టింది. అత్యయిక పరిస్థితి వల్ల ఇక్కడ 300పైగా విశ్వవిద్యాలయాలు, చాలా వరకు డార్మిటరీలు కూడా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రవాస భారతీయుల కోసం ఆ దేశంలోని ప్రముఖ ఇండియన్‌ అమెరికన్‌ బృందాలు హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేశాయి. 

భారతీయ అమెరికన్‌ విద్యార్థులకు సహకరించేందుకు భారతీయ-అమెరికన్‌ సేవాసంస్థ ‘సేవా ఇంటర్నేషనల్‌’, నిరంతరాయంగా నడిచే ఓ హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 20 మంది వైద్యుల నేతృత్వంలో ఉచిత సహాయక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాల నిర్వహణకు గాను 10,000 డాలర్లను కేటాయించారు. తమ సేవా ఇంటర్నేషనల్‌ అమెరికాలో ఉంటున్న భారతీయుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌ను స్వీకరించి వారికి తగిన సలహాలనిస్తుందని ఆ సంస్థ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ శ్రీశాంత్‌ లిపారు. అంతేకాకుండా తమ వాలంటీర్లు ఉచిత ఆహార పంపిణీ, వృద్ధులకు సహాయం, కొవిడ్‌-19 లక్షణాలను కలిగిన వారు వైద్యులను సంప్రదించేందుకు సహకరిస్తారని సంస్థ అధికారులు వివరించారు. 

కాగా తెలుగు అసోసియేషన్‌ ఆప్‌ నార్త్‌ అమెరికా (తానా) కూడా భారతీయుల కోసం కొవిడ్‌-19 హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. హఠాత్తుగా మూత పడిన విద్యాలయాల్లోని భారతీయ విద్యార్థులకు సహాయమందించేందుకు, కరోనా నివారణకు తమ హెల్ప్‌లైన్‌ పనిచేస్తుందని తానా తెలిపింది. భారత రాయబార కార్యాలయ సమన్వయంతో పనిచేసే ఈ సంస్థలు, ఈ అత్యవసర పరిస్థితిలో అమెరికాలో ఉంటున్న భారతీయులు తమ దేశానికి తిరిగి వెళ్లటానికి వీసా పొందటం వంటి వ్యవహారాల్లో కూడా సహకరిస్తున్నాయి. స్థానిక వ్యాపార, వైద్య సంస్థల సహాయంతో వివిధ సహాయక కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. 

Advertisement

Advertisement


మరిన్ని