కరోనా ఎఫెక్ట్‌: కువైట్‌లో తెలుగువారు క్షేమం
కరోనా ఎఫెక్ట్‌: కువైట్‌లో తెలుగువారు క్షేమం

కువైట్‌: కరోనా తీవ్రతను ఎదుర్కొనేందుకు కువైట్‌ సహా అన్ని దేశాలు తమ వంతు కృషి చేస్తున్నాయని కువైట్ తెలుగు కళా సమితి ప్రతినిధి గున్ను రమేశ్‌ తెలిపారు. కువైట్‌లో కరోనా కట్టడికి అక్కడి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి ఆయన వివరించారు. ‘‘కువైట్‌లో ఇప్పటి వరకు 72 మందికి కరోనా నిర్థారణ అయ్యింది. వీరిలో ఎక్కువ మంది ఇరాన్‌లోని ప్రార్థనా ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారే. బాధితులను గుర్తించిన వెంటనే కువైట్, సౌదీ సరిహద్దుల్లోని  ఓ రిసార్టుకు తరలించి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నారు. భాధితుల్లో భారతీయులెవరూ లేరు. ఇక్కడి ప్రభుత్వం ఆరోగ్య అత్యయిక స్థితి  ప్రకటించకపోయినా దాదాపు అదే స్థాయి చర్యలు తీసుకుంటోంది. ముందు జాగ్రత్త చర్యగా ఫిబ్రవరి 25 నుంచి పాఠశాలలకు రెండు వారాలు సెలవులు ప్రకటించారు. వైరస్‌ తీవ్రత పెరుగుతుండటంతో మార్చి 26 సెలవులు పొడిగించారు. 9వ తరగతి వరకు పరీక్షలు రద్దు చేశారు.  ఉత్తీర్ణతతో సంబంధం లేకుండా తర్వాతి తరగతులకు వెళ్లేలా నిర్ణయం తీసుకున్నారు. 10 నుంచి ఆపై తరగతుల వారికి మాత్రం పరీక్షలు నిర్వహిస్తారు’’ అని తెలిపారు.

బుధవారం కరోనాపై సమీక్ష నిర్వహించిన కువైట్ మంత్రి మండలి మార్చి 12 నుంచి 26 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు రమేశ్‌ తెలిపారు. ‘‘కాఫీ షాపులు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్‌, జిమ్‌లు, క్లబ్‌లను రెండు వారాల పాటు మూసి వేయాలని నిర్ణయించారు. ఒకే ప్రదేశంలో ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు. శుక్రవారం నుంచి కమర్షియల్ విమానాల రాకపోకలను నిలివేయనున్నారు. ముఖ్యంగా భారత్, ఇటలీ, చైనా తదితర 7 దేశాలకు దీన్ని వర్తింపచేస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని తెలిపారు.  మార్చి 1 తర్వాత విదేశాల నుంచి వచ్చిన వారికి 14 రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌గా ప్రకటించారు. విదేశాల నుంచి వచ్చిన వారంతా ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి పరీక్షలు చేయించుకొని, ఆ నివేదికలను వారు పని చేసే సంస్థల్లో సమర్చించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది’’ అని వివరించారు. తెలుగు కళా సమితి తరఫున తాము అప్రమత్తంగా ఉన్నామని, ఇక్కడ వివిధ ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారితో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని రమేశ్ తెలిపారు.

Advertisement

Advertisement


మరిన్ని