అమెరికన్లకు ఉచిత హిందీ క్లాసులు
అమెరికన్లకు ఉచిత హిందీ క్లాసులు

వాషింగ్టన్‌: భారత భాష, మన సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న అమెరికన్లు, విదేశీయుల కోసం అగ్రరాజ్యంలోని భారత ఎంబసీ మరోసారి శిక్షణా తరగతులు తీసుకొచ్చింది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో ఉచిత హిందీ క్లాసులు ఏర్పాటుచేసింది. ఎంబసీలోని ఇండియన్‌ కల్చర్‌ విభాగానికి చెందిన ఉపాధ్యాయుడు మోక్షరాజ్‌ విదేశీయులకు హిందీ బోధించనున్నారు. జనవరి 16 నుంచి ఈ తరగతులు ప్రారంభం కానున్నాయి. 

‘గత కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా భారత ఖ్యాతి విపరీతంగా పెరుగుతోంది. దీంతో మన సంస్కృతి సంప్రదాయాలు, కుటుంబ వ్యవస్థ, వైవాహిక బంధం, యోగా, ధ్యానం, వంటలు, సినిమాలు, రాజకీయాలు, వ్యాపారులు తదితర విషయాలను తెలుసుకునేందుకు విదేశీయులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందుకోసం హిందీ నేర్చుకోవాలనుకుంటున్నారు. అలా అమెరికాలో ఈ భాషకున్న పాపులారిటీ పెరుగుతోంది’ అని మోక్షరాజ్‌ తెలిపారు. 

గత రెండేళ్లుగా అమెరికాలోని భారత ఎంబసీ ఈ ఉచిత హిందీ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తోంది. అంతేగాక, జార్జ్‌ వాషింగ్టన్‌ యూనివర్శిటీ, జార్జ్‌టౌన్‌ యూనివర్శిటీ లాంటి ప్రముఖ విద్యాసంస్థలతో భాగస్వాములై విదేశీయులకు హిందీ నేర్పిస్తోంది. వాషింగ్టన్‌లోని భారత రాయబార కార్యాలయంలో తొలి సాంస్కృతిక రాయబారిగా మోక్షరాజ్‌ నియమితులయ్యారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అమెరికాలో ఏటా భారత ఎంబసీ నిర్వహించే యోగా కార్యక్రమానికి ఈయన నేతృత్వం వహిస్తున్నారు.

Advertisement

Advertisement


మరిన్ని