Biden: డెల్టా డేంజరస్‌.. టీకా వేసుకోండి!
Biden: డెల్టా డేంజరస్‌.. టీకా వేసుకోండి!

ప్రజలను అప్రమత్తం చేసిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌: తొలుత భారత్‌లో వెలుగుచూసిన కరోనా డెల్టా వేరియంట్‌ ఇప్పుడు యావత్‌ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవలే ఈ వేరియంట్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళనకర రకంగా గుర్తించింది. బ్రిటన్‌లో వెలుగు చూస్తున్న కొత్త కేసుల్లో మెజారిటీ కేసులు డెల్టా వేరియంట్‌కు చెందినవే కావడం గమనార్హం.

తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో సైతం డెల్టా వేరియంట్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన అధ్యక్షుడు బైడెన్ ఈ కొత్త రకం పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. దీని ముప్పు నుంచి తప్పించుకోవాలంటే వీలైనంత త్వరగా టీకా తీసుకోవాలని సూచించారు. డెల్టా వేరియంట్‌ వేగంగా వ్యాపించడమే కాకుండా ఎక్కువ ప్రాణాంతకమైందని నిపుణులు చెబుతున్నట్లుగా బైడెన్‌ ప్రజలకు వివరించారు. ముఖ్యంగా యువకుల్లో అధిక ప్రభావం చూపుతోందన్నారు.

నాలుగు నెలల్లోనే ఎంతో మార్పు..

ఇక గత 150 రోజుల్లో అమెరికాలో 300 మిలియన్ డోసులు ప్రజలకు అందజేసినట్లు వెల్లడించారు. తాను అధికారం చేపట్టిన నాటికి కరోనాతో దేశం తీవ్ర సంక్షోభంలో ఉందని తెలిపారు. ఇప్పుడు వైరస్‌ క్రమంగా అదుపులోకి వస్తోందని.. ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతోందన్నారు. తిరిగి ఉద్యోగ కల్పన ఊపందుకుందన్నారు. కేవలం నాలుగు నెలల్లోనే ఇదంతా సాధ్యమైందన్నారు. తన పాలనలో మహమ్మారిని పూర్తిగా నియంత్రించామని తెలిపిన ఆయన గత కొన్ని రోజులుగా ఆసుపత్రులో చేరికలు, మరణాలు భారీ ఎత్తున తగ్గిపోయాయని తెలిపారు.

ఇక వ్యాక్సినేషన్‌ రేటు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికీ కేసులు పెరుగుతున్నాయని బైడెన్‌ తెలిపారు. ‘సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌-(సీడీసీ)’ గణాంకాల ప్రకారం శుక్రవారం నాటికి 65 శాతం మంది పెద్దలు కనీసం ఒక డోసు తీసుకున్నారు.

Advertisement

Advertisement


మరిన్ని