ఆస్ట్రాజెనెకా: అమెరికా ప్రయోగాల్లో 79శాతం సమర్థత!
ఆస్ట్రాజెనెకా: అమెరికా ప్రయోగాల్లో 79శాతం సమర్థత!

వాషింగ్టన్‌: ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ అమెరికాలో జరిపిన ప్రయోగాల్లోనూ మెరుగైన పనితీరును కనబరిచింది. అక్కడ జరిపిన తుది దశ ప్రయోగాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ 79శాతం ప్రభావశీలత కనబరిచినట్లు వెల్లడైంది. దీంతో అత్యవసర వినియోగం కింద అనుమతి కోసం అమెరికా నియంత్రణ సంస్థలకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ఆస్ట్రాజెనెకా తెలిపింది. చిలీ, పెరూలో జరిపిన ప్రయోగాల్లోనూ ఇదే విధమైన పనితీరు కనబరిచినట్లు పేర్కొంది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ పనితీరుపై యూరప్‌ దేశాల్లో వ్యక్తమవుతోన్న అనుమానాల నేపథ్యంలో తాజాగా వెల్లడైన ఫలితాలు వ్యాక్సిన్‌ సమర్థతకు మరింత బలాన్ని చేకూర్చాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

అమెరికాలో వివిధ వయసుల వారిపై దాదాపు 32వేల మందిపై ఆస్ట్రాజెనెకా తుది దశ ప్రయోగాలు జరిపింది. తాజాగా ఈ ఫలితాల విశ్లేషణలో 79శాతం సమర్థత కనబరిచినట్లు వెల్లడైంది. ఇక తీవ్ర కేసులు, ఆసుపత్రుల్లో చేరే అవకాశమున్న కేసుల్లో 100శాతం సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. అయితే, మోడెర్నా(94శాతం), ఫైజర్‌(95శాతం) సమర్థత కలిగినట్లు ఇప్పటికే వెల్లడైంది. అమెరికాలో ఇప్పటివరకు ఫైజర్‌, మోడెర్నాతో పాటు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ తుది దశ ప్రయోగాలు ఆలస్యం కావడంతో వీటి సమాచార విశ్లేషణ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

బ్లడ్‌ క్లాట్‌పైనా సమీక్ష..

యూరప్‌ దేశాల్లో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ తీసుకున్న కొందరిలో రక్తం గడ్డ కడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో పలు దేశాలు వ్యాక్సిన్‌ పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగిన ప్రయోగాల్లో రక్తం గడ్డకట్టడంపై (బ్లడ్‌ క్లాట్‌) ప్రత్యేక భద్రతా కమిటీ నేతృత్వంలో సమీక్ష చేపట్టినట్లు ఆస్ట్రాజెనెకా వెల్లడించింది. వీటిన్నింటిలోనూ వ్యాక్సిన్‌ పూర్తి సురక్షితమని తేలడంతో ఎఫ్‌డీఏ అనుమతి కోసం మరికొన్ని వారాల్లోనే దరఖాస్తు చేసుకుంటామని ఆక్స్‌ఫర్డ్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇదిలాఉంటే, అమెరికాలో ఇప్పటివరకు 12కోట్ల డోసులను పంపిణీ చేసినట్లు అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం వెల్లడించింది.

Advertisement

Advertisement


మరిన్ని