టైమ్స్‌స్క్వేర్‌ వద్ద రెపరెపలాడనున్న జాతీయ జెండా
టైమ్స్‌స్క్వేర్‌ వద్ద రెపరెపలాడనున్న జాతీయ జెండా

న్యూయార్క్‌: ఈ ఆగస్టు 15 నాడు న్యూయార్క్‌ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్‌ స్క్వేర్‌ వద్ద భారత జాతీయ జెండా రెపరెపలాడనుంది. ప్రవాస భారతీయులకు ప్రాతినిధ్యం వహిస్తోన్న ఒక ప్రముఖ సంస్థ అమెరికాలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయనుంది.

‘మేం చరిత్ర సృష్టించబోతున్నాం’ అని న్యూయార్క్‌, న్యూజెర్సీ, కనెక్టికట్‌కు చెందిన ది ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్‌ అసోసియేషన్(ఎఫ్‌ఐఏ) ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆగస్టు 15, 2020న టైమ్స్‌ స్కేర్ వద్ద జెండాను ఎగరవేసే వేడుకను నిర్వహించనున్నామని సగర్వంగా ప్రకటించింది. న్యూయార్క్‌లోని భారత కాన్సులర్‌ జనరల్ రణధీర్‌ జైశ్వాల్ ఈ వేడుకలో గౌరవ అతిథిగా పాల్గొంటారని తెలిపింది. అలాగే ఎప్పటిలాగే ఎంపైర్‌ స్టేట్ బిల్డింగ్‌ను మూడు రంగులతో ప్రకాశింపజేసే సంప్రదాయాన్ని కొనసాగిస్తామని వెల్లడించింది.

కాగా, ఎఫ్ఏఐ తన ప్రముఖ కార్యక్రమమైన ఇండియా డే పరేడ్‌ను ప్రతి ఏడాది నిర్వహిస్తుంది. దానిలో యూఎస్‌ రాజకీయ నాయకులు, శాసన సభ్యులు, ప్రముఖులు పాల్గొంటారు. వేలాదిమందితో మాన్‌హట్టన్‌ ప్రాంతం నిండిపోతుంది. కానీ, ఈ సారి కరోనా వైరస్‌ కారణంగా ఆ కార్యక్రమ నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. 


మరిన్ని