Bathukamma: ఖండాంతరాల్లో పూల పండుగ
Bathukamma: ఖండాంతరాల్లో పూల పండుగ

 విదేశాల్లో ఘనంగా బతుకమ్మ సంబురాలు

ఈనాడు, హైదరాబాద్‌: విదేశాల్లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. ప్రవాస కుటుంబాలు ఇందులో పెద్దఎత్తున పాల్గొంటున్నాయి. సోమవారం లండన్‌ తెలంగాణ సంఘం(టాక్‌) ఆధ్వర్యంలో లండన్‌లోని టవర్‌ బ్రిడ్జి ప్రతిమ వద్ద చేనేత బతుకమ్మ ఉత్సవాలను జరిపారు. భారత సంతతికి చెందిన బ్రిటన్‌ ఎంపీలు వీరేంద్రశర్మ, సీమా మల్హోత్రా, హౌంస్లౌ మేయర్‌ బిష్ణుగురుగ్‌ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ ఎన్నారైలంతా సమాజసేవలో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి గొప్పదని తెలిపారు. టాక్‌ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. టాక్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్‌ కూర్మాచలం, ఇతర నేతలు ఎస్‌.రెడ్డి, సత్యమూర్తి, అశోక్, సురేశ్, జాహ్నవి తదితరుల ఆధ్వర్యంలో ఉత్సవాలు జరిగాయి. తెలంగాణ ఎన్నారై ఫోరం ఆధ్వర్యంలో లండన్‌లోని మరో ప్రాంతంలో బతుకమ్మ, దసరా సంబరాలు ఘనంగా నిర్వహించారు. 

జర్మనీలో... 

తెలంగాణ జర్మనీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బెర్లిన్‌లోని గణేశ ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జర్మనీ తెలంగాణ సంఘాధ్యక్షుడు, దేవాలయ కమిటీ అధ్యక్షుడు రఘు చలిగంటి, ఇతర నేతలు జీవన్‌రెడ్డి, జైరామ్, కృష్ణమూర్తిల ఆధ్వర్యంలో వేడుకల్లో జరిగాయి. ముఖ్య అతిథిగా భారత రాయబార కార్యాలయ కౌన్సిలర్‌ మధుసూదన్‌ కుటుంబ సమేతంగా తరలివచ్చారు. 

ఖతార్‌లో... 

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గల్ఫ్‌ దేశమైన ఖతార్‌లో బతుకమ్మ ఉత్సవాలను పెద్దఎత్తున జరిపారు. తెలంగాణ జాగృతి ఖతార్‌ అధ్యక్షురాలు నందిని అబ్బాగౌని ఆధ్వర్యంలో జరిగిన ఉత్సవాలకు మహిళలు, తమ కుటుంబాలతో తరలివచ్చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖతార్‌ భారత రాయబారి దీపక్‌ మిత్తల్‌ సతీమణి అల్పన, రాయబార కార్యాలయాధికారి పద్మ కర్రి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చేనేత కళాకారులకు అండగా సిరిసిల్ల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అగ్గిపెట్టెలో ఇమిడే చీర, ఉంగరంలో పట్టే చీరను తెలంగాణ చేనేత గొప్పతనాన్ని చూపారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా తెలంగాణ ఒగ్గు కథను ప్రదర్శించారు. 

Advertisement


మరిన్ని