బైడెన్‌కు వచ్చేవారం..పెన్స్‌కు రేపే
బైడెన్‌కు వచ్చేవారం..పెన్స్‌కు రేపే

బహిరంగంగా టీకా వేయించుకోనున్న నేతలు

దిల్లీ: కొవిడ్-19 టీకా భద్రతపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు అమెరికా అత్యున్నత స్థాయి నేతలు బహిరంగంగా టీకా వేయించుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ చీఫ్ క్రిస్టఫర్ టీకా వేయించుకొని, దానికి సంబంధించిన వీడియోను విడుదల చేశారు. తాజాగా ఆ దేశ అధ్యక్ష పదవికి ఎన్నికైన జోబైడెన్ వచ్చే వారంలో టీకా తీసుకోనున్నారు. ఇక ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్ శుక్రవారం వేయించుకోనున్నారు. దీనిపై శ్వేతసౌధం అధికారిక ప్రకటన జారీ చేసింది. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో బైడెన్ (78)మాట్లాడుతూ..‘నేను ముందుగానే టీకా తీసుకోవాలని అనుకోవట్లేదు. కానీ, ఈ టీకా సురక్షితమేనని ప్రజలకు వెల్లడించడం కోసమే మా ఈ ప్రయత్నం’ అని అన్నారు. వయసు రీత్యా ఆయనకు వైరస్ ముప్పు అధికంగా ఉంది. 

అప్పుడే ట్రంప్‌కు టీకా.. కొత్త సంవత్సరం జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న జోబైడెన్.. కరోనా వైరస్‌పై పోరుకే తన తొలిప్రాధాన్యం అని ఇప్పటికే వెల్లడించిన సంగతి తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ తీవ్రతను తక్కువ అంచనా వేసిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిని కొని తెచ్చుకున్నారు. నిపుణుల మాటలను పెడచెవిన పెట్టి ట్రంప్ ముందుకెళ్లిన కారణంగానే వైరస్‌ కేసులు, మరణాల్లో అమెరికా అగ్రస్థానంలో నిలవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు అక్కడ మూడు లక్షలకుపైగా మరణాలు సంభవించాయి. కాగా..టీకా సురక్షితమని తేలితే, ట్రంప్ దాన్ని స్వీకరిస్తారని శ్వేత సౌధ మీడియా కార్యదర్శి వెల్లడించారు. 

క్వారంటైన్‌లో మైక్ పాంపియో: అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆయన్ను కలిసి ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో  ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, నిర్ధారణ పరీక్షల్లో మాత్రం ఆయనకు నెగిటివ్‌గానే తేలింది. ఇదిలా ఉండగా..కరోనావైరస్‌పై విజయం సాధించే దిశగా సోమవారమే అమెరికా తొలి అడుగు వేసింది. ఆ రోజు నుంచే అక్కడ సామూహిక వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. టీకా ఇచ్చే క్రమంలో వైద్యారోగ్య సిబ్బందికే మొదటి ప్రాధాన్యం ఇచ్చింది. 

ఇవీ చదవండి:

కరోనా టీకా: అంతేనా..అసలు నొప్పే లేదు!

ఒకే టీకాపై ఆధారపడొద్దు

 

Advertisement


మరిన్ని