న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్ భారీ‌ తెరలపై శ్రీరామ ధామం
న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్ భారీ‌ తెరలపై శ్రీరామ ధామం

అమెరికాలో మిన్నంటిన భూమి పూజా సంబరాలు

(శ్రీరామునికి పూజలు  చేస్తున్న భక్తులు: ప్రతీకాత్మక చిత్రం)

వాషింగ్టన్‌: శతాబ్దాలుగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యా నగరిలో సరయూ నదీ తీరాన శ్రీరామ ధామం భూమి పూజ అంగరంగ వైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, గవర్నర్‌ ఆనంది బెన్‌ పటేల్‌, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ అధినేత మోహన్‌ భగవత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీరామ మందిరం భూమి పూజను పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా హిందువులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెరికాలోనూ హైందవ వర్గాలు పూజలు, యజ్ఞాలు, యాగాలు, దీపాలు వెలిగించి భక్తిని చాటుకున్నారు.

అమెరికాలో చాలా చోట్ల హిందువులు వర్చువల్‌ కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వహిందూ పరిషత్‌, అమెరికా శాఖకు చెందిన ఒక ట్రక్కు డిజిటల్‌ తెరలపై శ్రీరామ మందిరం చిత్రాలను ప్రదర్శిస్తూ వాషింగ్టన్‌ వీధుల్లో తిరిగింది. ‘జై శ్రీరాం’ నినాదాలు మార్మోగించింది. చాలా చోట్ల భక్తులు దీపాలు వెలిగించారు. ‘అయోధ్యలో రామ మందిరం భూమి పూజ నిర్వహిస్తున్న చారిత్రక దినోత్సవం సందర్భంగా భారతీయులు, ప్రత్యేకించి  రాముడిని ఆరాధించేవారికి శుభాకాంక్షలు’ అని కాలిఫోర్నియాకు చెందిన భారతీయ నేత అజయ్‌జైన్‌ భుతోరియా అన్నారు.

కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా అమెరికాలో చాలాచోట్ల వర్చువల్‌ కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం రోజు న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్‌ స్క్వేర్‌లో శ్రీరాముడు, రామ మందిరం నమూనాలను భారీ తెరలపై ప్రదర్శించనున్నారు. తమకు దీపావళి ముందుగానే వచ్చిందని కొందరు పేర్కొనడం గమనార్హం. భూమిపూజ వేడుకను చూసేందుకు రాత్రంగా మేల్కొని వుంటానని మానిక్‌ అడ్వాణీ అనే వ్యక్తి తెలిపారు. తాను ఇంట్లో పూజ చేసి భగవంతుడి ఆశీర్వాదాలు పొందుతానని ఆస్టిన్‌లోని సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ దీపక్‌ శ్రీధర్‌ పేర్కొన్నారు. హిందువుల కలను సాకారం చేసేందుకు ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్‌ ఎంతో కృషి చేశారని వారిద్దరూ పేర్కొనడం గమనార్హం.

కెనడాలోని బ్రాంప్టన్‌ నగర మేయర్‌ ప్యాట్రిక్‌ బ్రౌన్‌ అక్కడి హిందూవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘పవిత్రమైన అయోధ్యాపురిలో మందిరం నిర్మాణానికి కృషి చేసిన అందరికీ అభినందనలు. దీనిని సాకరం చేసినందుకు శ్రీశ్రీ రవిశంకర్‌కు కృతజ్ఞతలు’ అని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆ దేశంలోని దేవాలయాల్లో పూజలు నిర్వహించారు.


మరిన్ని