అమెరికాలో కరోనా: కీలక పదవిలో వివేక్‌ మూర్తి
అమెరికాలో కరోనా: కీలక పదవిలో వివేక్‌ మూర్తి

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్..‌ భారతీయ సంతతి వ్యక్తి, అమెరికా మాజీ  సర్జన్‌ జనరల్‌ వివేక్‌ మూర్తిని కీలక పదవిలో నియమించనున్నట్టు సమాచారం. ఆయనను ‘హెల్త్‌, హ్యూమన్‌ సర్వీసెస్‌ సెక్రటరీ’గా  వచ్చే వారం ప్రకటించనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. బైడెన్‌ ఏర్పాటు చేసిన ఆరోగ్య సలహా మండలికి డాక్టర్‌ మూర్తి నేతృత్వం వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఆయన బైడెన్‌కు చెందిన కొవిడ్‌-19 టాస్క్‌ ఫోర్స్‌ బృందం సహాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. 

సౌమ్యశీలిగా పేరొందిన మూర్తి, డిసెంబర్‌ 2014 నుంచి ఏప్రిల్‌ 2017 వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల 19వ సర్జన్‌ జనరల్‌గా ఉన్నారు. తన పదవీకాలంలో ఎబోలా, జికా వైరస్‌ వ్యాధులను ఇతర ఆరోగ్య సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కృషి చేశారు. అయితే డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడైన అనంతరం ఆయనను రాజీనామా చేయాల్సిందిగా కోరారు. కాగా, అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ ముఖ్య ఆరోగ్య సలహాదారుగా కొనసాగుతారంటూ బైడెన్‌ ప్రకటించారు. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రభుత్వంలో మరో ఉన్నతాధికారి జెఫ్‌ జయెంట్స్‌ను బైడెన్‌ శ్వేతసౌధ కరోనా వైరస్‌ కోఆర్డినేటర్‌గా నియోగించనున్నట్టు సమాచారం.


మరిన్ని