ఉత్కంఠ పోరు: కీలకంగా మారిన జార్జియా!
ఉత్కంఠ పోరు: కీలకంగా మారిన జార్జియా!

వాషింగ్టన్‌: అమెరికాలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోన్న వేళ ఫలితంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌ ఆధిక్యంలో ఉండటంతో ట్రంప్‌నకు మరికొన్ని స్థానాలు కీలకంగా మారాయి. వీటిలో 16 ఎలక్టోరల్‌ ఓట్లున్న జార్జియా ఇరువురు నేతలకు మరింత కీలకంగా మారింది. ఇప్పటికే ఇక్కడ 98శాతం ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. వీటిలో ట్రంప్‌ దాదాపు 27వేల (0.4శాతం) ఆధిక్యంలో ఉన్నారు. మరో రెండు శాతం ఓట్లు మాత్రమే లెక్కించాల్సి ఉంది. వీటిలో మరింత స్వల్ప ఆధిక్యం ఎవరికి వస్తే వారికే 16ఎలక్టోరల్‌ ఓట్లు లభించే అవకాశం ఉంది. దీంతో ఈ ఫలితం ఇద్దరికీ కీలకంగా మారిందనే చెప్పవచ్చు.

అమెరికా మీడియా ప్రకారం, ఇప్పటివరకు జో బైడెన్‌ ఆధిక్యంలో ఉన్నారు. ఆయనకు 264 ఎలక్టోరల్‌ ఓట్ల మద్దతు లభించగా ట్రంప్‌నకు 214 మాత్రమే లభించాయి. జార్జియా ఫలితం తేలిపోతే బైడెన్‌ విజేత నిలిచి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ, జార్జియాలో 16 ఎలక్టోరల్‌ ఓట్లు ట్రంప్‌నకు లభిస్తే మాత్రం ఫలితం మరింత ఉత్కంఠగా మారే అవకాశం ఉంది. అటు రెండు స్వింగ్‌ స్టేట్స్‌ ఉత్తర కరోలినా( 15), పెన్సిల్వేనియా (20) ల్లోనూ అధ్యక్షుడు ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నారు. వీటితోపాటు నెవాడాలోనూ ట్రంప్‌ ఆధిక్యం పొందగలిగితే ఆయనకు కూడా విజయావకాశాలుంటాయి. కానీ, నెవాడాలో మాత్రం బైడెన్‌ ఆధిక్యంలో ఉన్నారు. దీంతో అభ్యర్థుల భవితవ్యం తేలడంలో ఈ స్వింగ్‌స్టేట్స్‌ ఫలితం ఎంతో కీలకంగా మారనున్నాయి.

అయితే, జార్జియా కీలక రాష్ట్రం కావడంతో ఇప్పటికే అక్కడ 98శాతం కౌంటింగ్‌ పూర్తయ్యింది. దీంతో ఇక్కడ కౌంటింగ్‌పై అనుమానాలు వ్యక్తంచేసిన ట్రంప్‌ కోర్టును ఆశ్రయించారు. వెంటనే వీటి కౌంటింగ్‌ నిలిపివేయాలని కోర్టులో దావా వేశారు. అంతేకాకుండా పోలింగ్‌ సమయం పూర్తైన తర్వాత వచ్చే పోస్టల్‌ బ్యాలెట్‌లను కూడా అనుమతించవద్దని వాదిస్తున్నారు.

ఇవీ చదవండి..
లెక్కింపు ఆపండి.. కోర్టులకు వెళ్లిన ట్రంప్‌!
మరో రికార్డు దిశగా బైడెన్‌..!

Advertisement

Advertisement


మరిన్ని