మైక్‌ పెన్స్‌.. కమలా హారిస్‌.. ఓ ఈగ
మైక్‌ పెన్స్‌.. కమలా హారిస్‌.. ఓ ఈగ

వాడీవేడి చర్చలో అనుకోని అతిథి

జో బైడెన్‌ వ్యంగ్యాస్త్రాలు

వాషింగ్టన్‌: అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థులు కమలా హారిస్‌, మైక్‌ పెన్స్‌ ముఖాముఖిలోకి అనుకోని అతిథి వచ్చింది. వీరిద్దరూ వాడీవేడిగా మాట్లాడుకుంటుండగా.. అకస్మాత్తుగా ఓ ఈగ మైక్‌ పెన్స్‌ తలపై వాలింది. దాదాపు రెండు నిమిషాలు ఎటూ కదలకుండా ఉండిపోయింది.  

కమలా హారిస్‌, మైక్‌ పెన్స్‌ మధ్య బుధవారం ముఖాముఖి జరిగింది. ఇందులో భాగంగా జాతి విద్వేషం అంశంపై వీరిద్దరూ హోరాహోరీగా వాదిస్తుండగా అకస్మాత్తుగా ఓ ఈగ వచ్చి పెన్స్‌ తలపై వాలింది. పెన్స్‌ మాట్లాడుతున్నప్పటికీ కొన్ని నిమిషాల పాటు ఈగ కదలకుండా అక్కడే ఉంది. బహుశా ఈ విషయాన్ని పెన్స్‌ గుర్తించారో లేదో తెలియదు గానీ.. ఇంటర్నెట్‌లో ఈ ఘటన సెన్సేషన్‌ అయ్యింది. వీరి డిబేట్‌ను ఇంటర్నెట్‌ లైవ్‌లో చూసిన వారంతా కమలా హారిస్‌, పెన్స్‌ మాటలను పట్టించుకోకుండా కాసేపు ఈగ గురించే మాట్లాడుకున్నారు. 

ఈగ కోసం విరాళం ఇవ్వండి: బైడెన్‌

అటు సోషల్‌ మీడియాలోనూ ఈ ఘటన సంచలనంగా మారింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థి, డెమొక్రాటిక్‌ నేత జో బైడెన్‌ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ రిపబ్లికన్లపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ‘ఈ ప్రచార ఈగకు సాయం చేయడానికి 5 డాలర్లు విరాళం ఇవ్వండి’ అని బైడెన్‌ ట్వీట్‌ చేశారు. దీంతో పాటు కీటకాలను చంపే బ్యాట్‌ను పట్టుకుని ఉన్న ఫొటోను పోస్ట్‌ చేశారు. పలువురు నెటిజన్లు కూడా దీనిపై జోకులు పేల్చారు. ఆ ఈగకు కరోనా వైరస్‌ పరీక్షలు చేయించాలంటూ పోస్టులు చేశారు. 

కాగా.. అమెరికా ఎన్నికల డిబేట్‌లో ఊహించని అతిథి రావడం ఇదే తొలిసారి కాదు. 2016లో అప్పటి డెమొక్రాటిక్‌ అభ్యర్థి హిల్లరీ క్లింటర్‌, డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ముఖాముఖి జరుగుతుండగా ఓ ఈగ హిల్లరీ నుదురుపై వాలింది. ఆ ఘటన అప్పట్లో ఇంటర్నెట్‌ సెన్సేషన్‌ అయ్యింది. 

Advertisement

Advertisement


మరిన్ని