మళ్లీ గెలిస్తే..చైనాపై చర్యలు!
మళ్లీ గెలిస్తే..చైనాపై చర్యలు!

మరోసారి హెచ్చరించిన ట్రంప్‌!

వాషింగ్టన్‌: మనకు చేసిన అవమానానికి చైనాకు తగిన చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. నేను తిరిగి మళ్లీ అధికారంలోకి వస్తే చైనాపై మరిన్ని చర్యలు తీసుకుంటానని  హెచ్చరించారు. చైనా మనకు చేసింది చాలా అవమానకరమని, మున్ముందు చైనాతో చాలాచేయాల్సి ఉందని ట్రంప్‌ ఓ ఇంటర్వ్యూలో అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాప్తిని అడ్డుకట్టవేయడం కోసం మాస్కులు ధరించడంపై ప్రశ్నించగా.. ట్రంప్‌ ఈ విధంగా స్పందించారు. ‘బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించిరావడం చైనా తప్పిదం. మీరు మాస్కు ధరించి అక్కడ కూర్చోడానికి చైనానే కారణం. ఇది ఎంతో అవమానకరం. ఆ విషయాన్ని మీరు కూడా తెలుసుకుంటారు’ అని డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టంచేశారు. కరోనా మహమ్మారిని చైనా వైరస్‌గానే అభివర్ణించిన ట్రంప్‌ ఆ దేశానికి చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇక, అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతోన్న వేళ, చైనా మీడియాపై ఆంక్షలకు అమెరికా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఉన్న ఆరు చైనా మీడియా సంస్థలు చైనా ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నట్లు అమెరికా  అనుమానిస్తోంది. దీంతో ఆయా సంస్థల సిబ్బందిని విదేశీయులుగానే రిజిస్టర్‌ చేసుకోవాలని అమెరికా విదేశాంగశాఖ ప్రకటించింది. విదేశీ వ్యవహారాల చట్టం ప్రకారం ఇలా చేయక తప్పదని స్పష్టచేసింది. దీనిపై స్పందించిన చైనా, అమెరికా నిర్ణయాన్ని ఖండించింది. ఇదిలాఉంటే, గత కొంతకాలంగా అమెరికాలో చైనా మీడియా సంస్థల సిబ్బందికి ఇచ్చే వీసాల సంఖ్యను ట్రంప్‌ ప్రభుత్వం తగ్గిస్తూ వస్తోంది.

Advertisement

Advertisement


మరిన్ని