జొన్నలగడ్డ మూర్తికి వంశీ అక్కినేని వైద్యరత్న పురస్కారం
జొన్నలగడ్డ మూర్తికి వంశీ అక్కినేని వైద్యరత్న పురస్కారం

ఇంటర్నెట్‌ డెస్క్‌: నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భంగా వంశీ అక్కినేని వైద్యరత్న పురస్కార ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. కరోనా నేపథ్యంలో ఈసారి ఈ అవార్డుల కార్యక్రమాన్ని జూమ్‌ వేదికగా నిర్వహించారు. ఈ ఏడాది వంశీ అక్కినేని వైద్యరత్న పురస్కారం ప్రముఖ అనస్థీషియన్‌ జొన్నలగడ్డ మూర్తికి ప్రదానం చేశారు. సామాజిక సేవలందించినందుకు గాను ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన జొన్నలగడ్డ మూర్తి యూకే సౌత్‌ పోర్టులో అనస్థీషియన్‌గా పనిచేస్తున్నారు. ఆంధ్రా మెడికల్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయన.. విశాఖలో అనస్థీసియా విభాగంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (జిప్‌మర్‌)లో పనిచేశారు. గత 20 ఏళ్లుగా యూకేలోని అనస్థీషియన్‌గా ప్రాక్టీసింగ్‌ చేస్తున్నారు. సమాజానికి ఆయన చేస్తున్న సేవలతో పాటు యూకే, భారత్‌లో స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తించి మూర్తిని ఈ అవార్డుతో సన్మానించారు. అలాగే, తెలుగు సినీరంగానికి అందించిన సేవలకు గాను సీనియర్‌ నటి తోట రాజశ్రీని కూడా ఏఎన్‌ఆర్‌ వంశీ నేషనల్‌ అవార్డుతో సత్కరించారు. 

జూమ్‌ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత్‌ నుంచి సినీనటులు మురళీమోహన్‌, జమున, రోజారమణి, సత్యప్రియతో పాటు డైరెక్టర్‌ రేలంగి నరసింహారావు, సినీ గేయ రచయిత సుద్ధాల అశోక్‌ తేజ, డాక్టర్‌ మురళీకృష్ణ కుమార్తె రాజసులోచన పాల్గొన్నారు. యూకే నుంచి డాక్టర్‌ వివేకానంద మూర్తి, డాక్టర్‌ బాబూరావు, డాక్టర్‌ భారతి, డాక్టర్‌ నాగేశ్‌, డాక్టర్‌ సత్యనారాయణ, డాక్టర్‌ బ్రహ్మారెడ్డి పాల్గొనగా.. ఫ్రాన్స్‌ నుంచి డాక్టర్‌ డానియల్‌ నెగ్రెస్‌ పాల్గొన్నారు. అమెరికా నుంచి డాక్టర్‌ తోటకూర ప్రసాద్‌, డాక్టర్‌ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, జయశేఖర్‌ తాళ్లూరి, డాక్టర్‌ రాధా జయ శర్మ, డాక్టర్‌ జేఎం శర్మ, డాక్టర్‌ చిట్టెంరాజు వంగూరి, సింగపూర్‌ నుంచి రత్నకుమార్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. 

యూకే- ప్రెస్టన్‌లోని తెలుగు కమ్యూనిటీ అసోసియేషన్‌ సహకారంతో వంశీ ఇంటర్నేషనల్‌కు చెందిన వంశీ రామరాజు, సుధాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రముఖ ప్రముఖ సినీనటుడు మురళీమోహన్‌ జ్యోతిప్రజ్వలనం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమెరికాలోని హ్యూస్టన్‌ నగరానికి చెందిన ఆకునూరి శారద ఏఎన్‌ఆర్‌, జమున, రాజశ్రీ, రోజారమణి చిత్రాల నుంచి పాటలను ఆలపించి అందరినీ మైమరపించారు. ఈ సందర్భంగా లక్ష్మీ శ్రీనివాస్‌ ఏఎన్‌ఆర్‌ నటించిన డాక్టర్‌ చక్రవర్తి చిత్రంలోని పాటను వీణ ద్వారా వినిపించి అలరించారు. సుప్రసిద్ధ సినీ గేయ రచయిత సుద్ధాల అశోక్‌ తేజ నట సామ్రాట్‌ సీరియల్‌లో తాను రాసిన పాటను ఆలపించారు. ఏఎన్‌ఆర్‌ నటించిన బుద్ధిమంతుడు చిత్రంలో ఆయన వాయిస్‌ను డాక్టర్‌ వివేకానంద మూర్తి మిమిక్రీ చేసి ఆకట్టుకున్నారు. 

Advertisement

Advertisement

Tags :

మరిన్ని