అక్టోబరుకే వ్యాక్సిన్‌ రెడీ: ట్రంప్‌ ధీమా
అక్టోబరుకే వ్యాక్సిన్‌ రెడీ: ట్రంప్‌ ధీమా

వందల బిలియన్‌ డాలర్లతో ప్రక్రియను వేగవేంతం చేశాం

వాషింగ్టన్‌: అమెరికన్లను కరోనా వైరస్ మహమ్మారి నుంచి కాపాడే వ్యాక్సిన్ అక్టోబర్‌లోనే అందుబాటులోకి వస్తుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి ప్రకటించారు. అయితే ట్రంప్‌ వ్యాఖ్యలను నమ్మలేమని డెమొక్రటిక్‌ ఉపాధ్యక్ష అభ్యర్ధి కమలా హారిస్‌ కొట్టి పారేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ ట్రంప్‌ చెప్పినట్టుగానే వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినా.. దాని సామర్ధ్యం, భద్రతలపై ఆమె సందేహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్‌ మాట్లాడుతూ.. ఏదైనా కొత్త వ్యాక్సిన్‌ను కనుగొనేందుకు సాధారణంగా సంవత్సరాల తరబడి సాగే ప్రక్రియను ... తమ ప్రభుత్వం వందల బిలియన్ డాలర్లు వెచ్చించి వేగవంతం చేసిందని అన్నారు. జనవరి 2021నాటికి తమ దేశంలో పంపిణీ చేసేందుకు 300 మిలియన్ల డోసులను సిద్ధం చేసేందుకు ‘‘ఆపరేషన్‌ వార్ప్‌ స్పీడ్‌’’ పేరుతో తాము ప్రవేశపెట్టిన కార్యక్రమ లక్ష్యమని వివరించారు.

ఈ విషయమై ఆ దేశానికి చెందిన అంటు వ్యాధుల చికిత్స నిపుణుడు ఆంటొనీ ఫౌచీ స్పందిస్తూ.. అక్టోబర్‌ కల్లా వ్యాక్సిన్‌ తయారీ కష్టతరమైనా.. అసాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా సదరు వ్యాక్సిన్‌ సురక్షితం, ప్రభావవంతం కానిదే దానిని అమెరికా ప్రజలు వాడేందుకు అనుమతులు లభించవని వెల్లడించారు. కాగా, ఆ దేశంలో మూడు కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ తయారీయత్నాలు ఇప్పటికే తుది దశలో ఉన్నట్టు తెలిసిందే.

Advertisement

Advertisement


మరిన్ని