పాక్‌కు చైనా ‘బాతు’ సాయం
close
పాక్‌కు చైనా ‘బాతు’ సాయం

బీజింగ్‌: మిడతలతో సతమతమవుతున్న పాకిస్థాన్‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చింది డ్రాగన్‌ దేశం చైనా. ఇందులో భాగంగానే ఆ దేశానికి ‘బాతు సాయం’ ప్రకటించింది. మిడతలపై పోరాటంలో పాక్‌కు సాయం చేసేందుకు లక్ష బాతుల ‘ఆర్మీ’ని పంపించనున్నట్లు చైనా స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

చైనా నిపుణుల సలహా మేరకు జిజియాంగ్‌ ప్రావిన్స్‌ నుంచి ఈ బాతులను పాక్‌కు పంపనున్నట్లు సదరు కథనాలు తెలిపాయి. మిడతలను అరికట్టేందుకు గత కొంతకాలంగా చైనా.. బాతులనే తమ ఆయుధంగా వినియోగించుకుంటోంది. వీటి వల్ల ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణం కూడా దెబ్బతినకుండా ఉండటంతో గత రెండు దశాబ్దాలుగా జిజియాంగ్‌ ప్రావిన్స్‌లో పెద్ద సంఖ్యలో బాతులను పెంచుతోంది. 

అంతేగాక, కోడితో పోలిస్తే బాతుతో రెట్టింపు లాభాలున్నాయట. కోళ్ల మాదిరిగా కాకుండా బాతులు ఎప్పుడూ సమూహాలుగానే తిరుగుతాయి. దీంతో వీటి నిర్వహణ సులభంగా ఉంటుంది. పైగా 
ఒక కోడి రోజుకు కేవలం 70 మిడతలను తింటే.. బాతు 200లకు పైగా మిడతలను తినగలుగుతుందని జిజియాంగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ టెక్నాలజీ రీసర్చర్‌ లు లిజి తెలిపారు. మిడతలను అరికట్టేందుకు రసాయనాలు, ఎరువులు ఉపయోగిస్తే పర్యావరణం దెబ్బతినడంతో పాటు పంట నష్టం కూడా వాటిల్లే ప్రమాదం ఉన్నందున బాతులే వీటికి బెస్ట్‌ అంటున్నారు నిపుణులు. 

గత 20ఏళ్లలో ఎన్నడూ లేనంతగా గతేడాది నుంచి పాక్‌లో మిడతలు దండెత్తాయి. లక్షల సంఖ్యలో మిడతలు పంటలపై దాడి చేసి వాటికి పెద్ద ఎత్తున నష్టం కలిగిస్తున్నాయి. పాక్‌లోనే కాదు.. భారత్‌లోని గుజరాత్‌ రాష్ట్రంలో పంటలను కూడా నాశనం చేస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన పాక్‌ ప్రభుత్వం.. ఆ మధ్య అత్యయిక స్థితి ప్రకటించింది. అంతేగాక, ఈ సమస్య నుంచి రైతులను కాపాడేలా సత్వర ప్రణాళిక కోసం రూ.730 కోట్లు కేటాయించింది. 

Tags :

మరిన్ని