రాముడు రావణుడిని ఓడించినట్లుగానే..:బోరిస్‌ జాన్సన్
రాముడు రావణుడిని ఓడించినట్లుగానే..:బోరిస్‌ జాన్సన్

సమోసా, గులాబ్‌ జామూన్ మిస్సవుతున్నారని తెలుసు

లండన్‌: బ్రిటన్‌లో మొదటిసారి వర్చువల్ దీపావళి వేడుకలు నిర్వహిస్తోన్న సందర్భంగా ప్రధాని బోరిస్ జాన్సన్‌ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అందులో మన భారతీయ సంప్రదాయాలను ప్రస్తావించి..కరోనా వైరస్‌పై విజయం సాధిస్తామని ఆకాంక్షించారు. ఆ దేశంలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడి ప్రభుత్వం రెండోసారి లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ నుంచి మాట్లాడారు. 

‘ప్రస్తుతం మన ముందు అతిపెద్ద సవాలు ఉన్నప్పటికీ..ప్రజల సంకల్పంపై నాకు విశ్వాసం ఉంది. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం విజయం సాధిస్తుందని దీపావళి పండుగ బోధిస్తున్నట్లుగా మనమంతా కలిసికట్టుగా వైరస్‌పై విజయం సాధిస్తాం. రావణాసురుడిని ఓడించి సీతారాములు తిరిగి వస్తున్నప్పుడు వారి దారంతా భారీ సంఖ్యలో దీపాలతో వెలిగిపోయింది. మనం కూడా మన దారిని కనుగొంటాం. విజయవంతంగా ముందుకు వెళ్తాం’ అని భారతీయ సంప్రదాయాల ఔన్నత్యాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ఈ పండుగను సురక్షితంగా జరుపుకోవడానికి యూకేలోని  భారతీయ సమాజం చేస్తోన్న కృషిని జాన్సన్ ప్రశంసించారు. అందరు కలిసి ఒక దగ్గర చేరి.. సరదాగా గడుపుతూ.. సమోసా, గులాబ్ జామూన్‌ వంటివి పంచుకుంటూ జరుపుకొనే పండుగను నిబంధనలు పాటిస్తూ దూరంగా ఉండి చేసుకోవడం అంత సులభం కాదని తెలుసని అక్కడి ప్రవాసభారతీయులను ఉద్దేశించి అన్నారు.  కాగా, మూడు రోజుల వర్చువల్ దీపావళి ఫెస్ట్ ప్రధాని ప్రసంగంతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో యూకే హోం శాఖ కార్యదర్శి ప్రీతి పటేల్, ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు కీర్ స్టార్మర్ తదితర నేతలు పాల్గొన్నారు.


మరిన్ని