ట్రంప్‌ వదిలేస్తే, బైడెన్‌ క్యాచ్‌ పట్టాడు!
ట్రంప్‌ వదిలేస్తే, బైడెన్‌ క్యాచ్‌ పట్టాడు!

న్యూయార్క్: ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌ తన రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తున్నారు. శత్రువుకు శత్రువు మనకు మిత్రుడనే సూత్రాన్ని కాబోయే అధ్యక్షుడు అమలులో పెడుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వైఖరిని వ్యతిరేకించి ఉద్వాసనకు గురైన పలువురు ఉన్నతాధికారులు, శాస్త్రవేత్తలకు బైడెన్‌ తన శిబిరంలో స్థానం కల్పిస్తున్నారు. తన ప్రభుత్వం ఎదుర్కోనున్న సవాళ్లలో కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవటమే అతి పెద్దదని.. ఇందుకు గాను శాస్త్రవేత్తలు, వైద్య నిపుణుల సలహాలను స్వీకరిస్తానని బైడెన్‌ ఈ సందర్భంగా ప్రకటించారు. ఇదిలా ఉండగా దాదాపు రెండు నెలల పదవీకాలం మిగిలి ఉన్న ట్రంప్‌.. ఈ సమయాన్ని  బైడెన్‌ను, తనను వ్యతిరేకించిన వారిని ఇరుకున పెట్టేందుకు వినియోగించవచ్చని పరిశీలకులు అంటున్నారు. తాజాగా డిఫెన్స్‌ సెక్రటరీ మార్క్‌ ఎస్పర్‌ను పదవి నుంచి తొలగించటం కూడా దీనిలో భాగమేనని వారు విశ్లేషించారు.

ట్రంప్‌ పెడ ధోరణి

కరోనా కమ్ముకొస్తున్న సమయంలో కూడా ట్రంప్‌ చాలా కాలం పాటు మాస్క్‌ను ధరించని సంగతి తెలిసిందే. కొవిడ్‌-19 సోకిన అనంతరం కూడా తాను మహమ్మారిని జయించానని ఆయన మోతాదును మించి ధీమా వ్యక్తం చేశారు. మహమ్మారి కట్టడి విషయంలో పలువురు నిపుణుల సలహాలను ట్రంప్ బేఖాతరు చేయటమే కాకుండా.. అమెరికన్‌ ప్రజలకు అమితంగా గురి ఉన్న ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీని పదవి నుంచి తొలగించే ఆలోచనలో ఉన్నట్టు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఆగ్రహానికి బలైన పలువురిని కాబోయే అధ్యక్షుడు బైడెన్‌ చేరదీస్తున్నారు. భారతీయ అమెరికన్‌ డాక్టర్‌ వివేక్‌ మూర్తి కొవిడ్‌ కట్టడి తదితర విషయాల్లో ట్రంప్‌ వైఖరిని బహిరంగంగా వ్యతిరేకించి ఆయన ఆగ్రహానక గురయ్యారు. మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌, కరోనా చికిత్సకూ ఉపయోగపడుతుందన్న ఆధారంలేని ట్రంప్‌ వ్యాఖ్యలను ఖండించి, ఫిర్యాదు చేసినందుకు టీకా నిపుణుడు డాక్టర్‌ రిక్‌ బ్రైట్‌ను ట్రంప్‌ ప్రభుత్వం పక్కన పెట్టింది.

శత్రువుకు శత్రువు..

కాగా కొవిడ్‌ నియంత్రణలో భాగంగా బైడెన్‌ ఏర్పాటుచేసిన సలహా మండలికి డాక్టర్‌ వివేక్‌ సారథ్యం వహించనున్నారు. దీనికి డాక్టర్‌ డేవిడ్‌ కెస్లర్‌, డాక్టర్‌ మార్సెలా న్యూనెజ్‌ స్మిత్‌లు ఇతర పాలక సభ్యులుగా ఉంటారు. ఇక డాక్టర్‌ రిక్‌ బ్రైట్‌తో సహా ట్రంప్‌ కక్ష సాధింపుకు బలైన ప్రముఖ సర్జన్‌ డాక్టర్‌ అతుల్‌ గవాండే, అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ మైఖేల్‌ ఆస్లర్‌హామ్‌, బయోడిఫన్స్‌ నిపుణుడు లూసియానా బోరియో, క్యాన్సర్‌ వ్యాధి నిపుణుడు డాక్టర్ ఎజెకియెల్‌ ఇమ్మాన్యుయెల్‌, డాక్టర్‌ సెలినే గౌండర్‌, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ జూలియా మోరిటా, అత్యవసర వైద్య నిపుణుడు డాక్టర్‌ రాబర్ట్‌ రోడ్రిగ్స్‌, ఎయిడ్స్‌-అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్‌ ఎరిక్‌ గూస్‌బై తదితరులు బైడెన్‌ టాస్క్‌ ఫోర్స్‌లో భాగమయ్యారు.

Advertisement


మరిన్ని