అమెరికా అధ్యక్ష పీఠం బైడెన్‌దే
అమెరికా అధ్యక్ష పీఠం బైడెన్‌దే

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై కొన్ని రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించారు. విజయానికి అవసరమైన మ్యాజిక్‌ మార్క్‌ను ఆయన దాటేసినట్టు అమెరికా మీడియా సంస్థలన్నీ వెల్లడించాయి. బైడెన్‌కు ఇప్పటివరకు 284 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చినట్టు అసోసియేటెడ్‌ ప్రెస్‌ తెలిపింది. సీఎన్‌ఎన్‌ కూడా బైడెన్‌ మ్యాజిక్‌ మార్కు దాటేసినట్టు వెల్లడించింది. కీలకమైన పెన్సిల్వేనియాలో బైడెన్‌ ఆధిక్యం సాధించి గెలుపు తీరాన్ని చేరినట్టు అమెరికా మీడియా సంస్థలు ప్రకటించాయి. మొత్తం 538 ఎలక్టోరల్‌ కాలేజీ ఓట్లకు గాను బైడెన్‌ 284 ఓట్లు సాధించగా.. రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్ 214 ఎలక్టోరల్‌ ఓట్లకే పరిమితమయ్యారు. పెన్విల్వేనియా రాష్ట్రంలో విజయం సొంతం కావడంతో 77 ఏళ్ల  వయసులో జో బైడెన్‌  అధ్యక్ష పదవీ కల సాకారమైంది. ఈ గెలుపుతో అమెరికా అధ్యక్షుడిగా బైడెన్‌, ఉపాధ్యక్షురాలిగా భారత సంతతికి చెందిన కమలా హారిస్‌ ప్రమాణం చేయనున్నారు.  

బైడెన్‌కే జై కొట్టిన అమెరికన్లు

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓట్లు సాధించి బైడెన్‌ గెలవడానికి అసలు కారణం ఆయన రాజకీయ ప్రస్థానమే. సుదీర్ఘ రాజకీయ అనుభవమే అమెరికా జై బైడెన్‌ అనేలా చేసింది. ట్రంప్‌ పాలన వైఫల్యాలు కూడా బైడెన్‌ విజయ సోపానాలయ్యాయి. ఆరోగ్య రంగాన్ని  ట్రంప్‌  నిర్లక్ష్యం చేయడం.. అదే సమయంలో కరోనా కాటుకు అమెరికన్లు భారీగా చనిపోవడం అక్కడి ప్రజలను కలిచివేసింది. అరోగ్య రంగానికి ప్రాధాన్యమిస్తానని బైడెన్‌ ముందునుంచీ సగటు అమెరికన్‌ పౌరుడికి హామీలు ఇవ్వడం ఆయన గెలుపునకు దారితీసిందని చెప్పవచ్చు. 

ఆ స్వభావమే కలిసొచ్చింది!

అమెరికాలో ఒకసారి అధ్యక్ష పీఠం ఎక్కినవారు రెండోసారి అధిష్ఠించడం పరిపాటిగా మారిన తరుణంలో ట్రంప్‌కు అవకాశం లేకుండా చేసిన బైడెన్‌.. తన రాజకీయ పరిపక్వతతో ప్రజల మనస్సులు గెలుచుకున్నారు. 77 ఏళ్ల వయస్సులో అగ్ర రాజ్య అధ్యక్ష పదవి చేపట్టే వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. ఎవరూ ఊహించని రీతిలో స్వింగ్‌ రాష్ట్రాల్లోనూ విజయ దుందుభి మోగించారు. 50 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎట్టకేలకు అధ్యక్ష పీఠం కైవసం చేసుకున్నారు. సర్వేలన్నీ బైడెన్‌కే అనుకూలంగా వచ్చినప్పటికీ పోటీ రసవత్తరంగా సాగింది. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటర్లలో అత్యధికులు ‘జో’కే జై కొట్టారు. ఫలితంగా కీలక రాష్ట్రాల్లో స్వల్ప వ్యత్యాసంతో ట్రంప్‌ను అధిగమించారు. ట్రంప్‌లా కాకుండా చాలా కింద స్థాయి నుంచి రాజకీయ నేతగా ఎదిగిన బైడెన్‌ తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని రంగరించి ఎన్నికల బరిలో దిగారు. సౌమ్యత, ఆలోచించి మాట్లాడే స్వభావం ఆయనకు బాగా కలిసి వచ్చాయి.

ట్రంప్‌కు ఇవే ఎసరు తెచ్చాయా?

ఒబామా హయాంలో తెచ్చిన ఆరోగ్య బీమా, ఒబామా కేర్‌ను వ్యతిరేకించిన ట్రంప్‌ అందుకు ప్రత్యామ్నాయం చూపి ప్రజల్ని మెప్పించడంలో విఫలమయ్యారు. కొవిడ్‌ను ట్రంప్‌ యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం చేయడం.. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కంటే ఆర్థిక వ్యవస్థ తెరిచేందుకే అధిక ప్రాధాన్యమివ్వడం కూడా ఆగ్రహావేశాలకు కారణమైంది. అమెరికాలో నల్ల జాతీయులపై అకృత్యాలు పెరిగిపోవడం, జాతి విద్వేషాలు రెచ్చగొట్టేలా ట్రంప్‌ ప్రసంగాలు చేయడం ఆయన విజయానికి ఎసరు తెచ్చిందని చెప్పొచ్చు. అమెరికా రాజకీయాల్లో కురువృద్ధుడిగా పేరున్న జో బైడెన్‌కు‌.. ఒబామా హయాంలో రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. అనుభవజ్ఞుడైతేనే భవిష్యత్తులో అమెరికా పరిస్థితులు మారతాయనే నమ్మకం ప్రజల్లో బలంగా నాటుకుంది. కాలుష్యం కారణంగా భూతాపం పెరిగిపోతుండడటం, వాతావరణ మార్పులు తలెత్తడంలాంటి పరిణామాల వల్లే నిరంతరం కాలిఫోర్నియా అడవులు తగలబడి పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం జరగడం కూడా అమెరికాన్లను ఆలోచింపజేసింది. ట్రంప్‌ రాగానే ప్యారిస్‌ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగగా.. తాము అధికారంలోకి వస్తే తిరిగి ప్యారిస్‌ ఒప్పందంలో చేరతామని బైడెన్‌ చెప్పడంతో ఆయనపై ఓటర్లలో మరింత సానుకూల వైఖరి ఏర్పడింది.


Advertisement

Advertisement


మరిన్ని