కరోనాతో కకావికలమవుతున్న అమెరికా!
కరోనాతో కకావికలమవుతున్న అమెరికా!

ఒకేరోజు 2,10,000 కేసులు.. 3,157 మరణాలు

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. గురువారం రాత్రి 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 2,10,000లకు పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,41,24,678కి చేరింది. ఇక కొత్తగా 3,157 మంది మహమ్మారి బారిన పడి మరణించడంతో మృతుల సంఖ్య 2,76,148కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయి మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారి. ఏప్రిల్‌ తొలిదశ విజృంభణ సమయంలో నమోదైన 2,603 మరణాలే ఇప్పటి వరకు అత్యధికం.

కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ఆస్పత్రిలో చేరుతున్న వారి సంఖ్యా క్రమంగా ఎక్కువవుతోంది. నెల వ్యవధిలో ఈ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం నాటికి ఆస్పత్రిలో చేరిన కొవిడ్‌ బాధితుల సంఖ్య ఏకంగా లక్ష దాటింది. పండగ సీజన్‌ కావడంతో ప్రజలు నిబంధనలు ఉల్లంఘించడం వల్లే కేసులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న కేసులు వైద్య సిబ్బందికి ప్రమాదకరంగా మారాయి. ఇప్పటి వరకు అమెరికాలో సంభవించిన మరణాల్లో 39శాతం వైద్యారోగ్య సిబ్బంది, కొవిడ్‌ కేంద్రాల్లో చికిత్స పొందిన బాధితులే ఉండడం అందరినీ కలచివేస్తోన్న అంశం. మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్‌ రానుండడంతో వీరికే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించారు.


మరిన్ని